మాంసాహార ప్రియలు ఇష్టపడే వాటిలో చేపలు ఒకటనే సంగతి తెలిసిందే. చేపలు తినడం వల్ల అనేక పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల వైద్యులు చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెబుతుంటారు. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో చేపలు ఎంతగానో సహాయపడతాయి. చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన జింక్ , అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము లభిస్తాయి.
చేపలు జీవక్రియలకు ఎంతగానో సహాయపడటంతో పాటు శరీరంలోని కొవ్వులను అదుపులో ఉంచుతాయి. చేపలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సైతం పొందవచ్చు. అయితే మార్కెట్ లో చేపలు తాజావో కావో అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చేపలను సులభంగా గుర్తించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. చేపల నుంచి వెలువడే వాసనను బట్టి చేపలు తాజావో కాదో గుర్తించడం సాధ్యమవుతుంది.
చేపలను పట్టుకుని ఒత్తిన సమయంలో అవి మెత్తగా ఉంటే ఎప్పుడో పట్టిన చేపలని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా గట్టిగా ఉంటే మాత్రం ఆ చేపలు తాజా చేపలు అని భావించాలి. చేప కళ్ల గుడ్డు లోపలికి వెళ్లిపోయినా కళ్లపై తెల్లటి పొర ఏర్పడినా ఆ చేపలు తాజా చేపలు అయితే కాదు. చేపల మొప్పలను పరిశీలించి అవి తాజావో కాదో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. చేపలకు మొప్పల క్రింద చూస్తే తేమతో కూడిన గులాబీ రంగు ఉంటే తాజా చేపలని అర్థం చేసుకోవాలి.
ఆ విధంగా కాకుండా చేపలు పొడిబారిపోయి ఉంటే నిల్వ ఉన్న చేపలు అని అర్థం చేసుకొని వాటిని తినకుండా ఉంటే మంచిది. మొప్పలకు రంగు వేయడం వల్ల కొనుగోలుదారుడు మోసపోయే అవకాశం ఉంటుంది. చేపలను కొనుగోలు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.