ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని కరోనా బాధితులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా కరోనా రోగులకు చికిత్స చేయించుకునే అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్ ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న తరువాత ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను సైతం ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం గమనార్హం.
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న్ తరువాత కూడా కొంతమంది రోగులు పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు సీఎం జగన్ దృష్టికి వచ్చింది. ఏపీలో ఇప్పటివరకు 8,38,363 కరోనా కేసులు నమోదు కాగా వీరిలో 8,09,770 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే వీళ్లు అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
దీంతో సీఎం జగన్ పోస్ట్ కోవిడ్ మేనేజ్‌మెంట్ స్కీమ్ ను రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో తక్షణమే ఈ స్కీమ్ అమలులోకి వస్తుందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధ పడుతున్న రోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అధికారుల నివేదిక మేరకు చికిత్సకు సంబంధించి ధరల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఐసోలేషన్ వార్డ్, నర్సింగ్, పర్యవేక్షణ కోసం రోజుకు 900 రూపాయలు, కన్సల్టేషన్ చార్జీల కోసం రోజుకు 400 రూపాయలు, వ్యాధుల నిర్ధారణ పరీక్షల కొరకు 700 రూపాయలు, వైరస్ సోకకుండా డిస్ ఇన్ఫెక్షన్ చేసేందుకు 230 రూపాయలు, ఆక్సిజన్, నెబులైజేషన్ చార్జీల కోసం 500 రూపాయలు, పోషకాహారం కోసం 2,000 రూపాయలు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వం రోజుకు 2,930 రూపాయల చొప్పున కరోనా నుంచి కోలుకున్న రోగుల కోసం ఖర్చు చేయనుంది.