IRDAI : హెల్త్ ఇన్సూరెన్స్ తెలిస్తే అది దానికి మాత్రమే పనికొస్తుంది. ప్రాపర్టీ బీమా చెల్లిస్తే అది అంతవరకే వర్తిస్తుంది. ప్రమాద బీమా కవరేజీ చేస్తే.. అది కేవలం ఆ పరిధి వరకు మాత్రమే పనికొస్తుంది. దేశంలో ఎన్నో బీమా సంస్థలు ఉన్నప్పటికీ ఒక్క బీమా పాలసీతోనే అన్ని కవరేజీలు ఇవ్వడం లేదు. దీనివల్ల వినియోగదారులపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నది. అయితే వీటన్నింటికీ చరమగీతం పాడి ఆల్ ఇన్ వన్ బీమా పాలసీని తెరపైకి తీసుకువచ్చే ఆలోచనలో “ఐఆర్ డీ ఐఏ” ఉన్నది. దీనిపై కసరత్తు ప్రారంభించింది.
ఆల్ ఇన్ వన్
భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ).. ఆల్ ఇన్ వన్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఈ పాలసీ ద్వారా అందుబాటు ధరలో జీవిత, ఆరోగ్య, ప్రమాద బీమా కవరేజీతో పాటు పాలసీదారు ఆస్తికి సైతం బీమా భద్రత కల్పించనున్నట్లు ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా చెబుతున్నారు. అంతేకాదు, బీమా కంపెనీలు క్లెయిమ్స్‌ను గంటల్లో పరిష్కరించే దిశగా ఐఆర్‌డీఏఐ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, బీమా పాలసీ కొనుగోలు సమయంలో జిమ్ లేదా యోగా మెంబర్‌షిప్ వంటి వేల్యూ యాడెడ్ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. గడిచిన కొన్నేళ్లలో దేశీయ బీమా రంగం గణనీయంగా వృద్ధి చెందింది. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు పోటీగా పలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు సేవలందిస్తున్నాయి. అయినప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో బీమా సేవల వితరణ రేటు చాలా తక్కువగా ఉంది. దేశంలో బీమా సేవలను మరింత విస్తరింపజేయడంతోపాటు ఇన్సూరెన్స్ పాలసీలను మరింత ఆకర్షణీయంగా, చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు ఐఆర్‌డీఏఐ నడుం బిగించింది.
సమగ్ర ప్రణాళిక
జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్‌తో కలిసి బీమా త్రిమూర్తి పేరుతో సమగ్ర ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్రణాళిలో మూడు భాగాలున్నాయి. అవి, 1. బీమా విస్తార్, 2. బీమా సుగమ్, 3. బీమా వాహక్. వాటి వివరాలు.. ఇలా ఉన్నాయి.
బీమా సుగమ్
ఇన్సూరెన్స్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లను అనుసంధానించేందుకు బీమా సుగమ్ పేరుతో కొత్త వేదికను ఏర్పాటు చేస్తోంది ఐఆర్‌డీఏఐ. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు బీమా పాలసీలను కొనుగోలు చేయడంతోపాటు బీమా కంపెనీల ఇతర సేవలందుకునేందుకూ వీలుంటుంది. ప్లాట్‌ఫామ్‌కు డిజిటల్ డెత్ రిజిస్ట్రీల అనుసంధానం ద్వారా బీమా కంపెనీలు గంటల్లో లేదా ఒక్కరోజులో క్లెయిమ్స్‌ను పరిష్కరించేందుకు వీలుంటుంది.
బీమా విస్తార్
ఒకే పథకం ద్వారా జీవిత, ప్రమాద, ఆరోగ్య, ప్రాపర్టీ కవరేజీ కల్పించడమే బీమా విస్తార్ ఉద్దేశం. ఈ పథకం ప్రతి రిస్క్ కేటగిరీకి నిర్దేశిత ప్రయోజనాలను లేదా కవరేజీని ఆఫర్ చేస్తుంది. అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా, సరళంగా ఈ పాలసీని రూపొందించనున్నారు.
ఏదైనా నష్టం జరిగినప్పుడు, పాలసీదారు కవరేజీ సొమ్ము కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా, నిర్దేశిత ప్రయోజనం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
బీమా వాహక్
జూ గ్రామ స్థాయిలో బీమా సేవలను విస్తరింపజేసేందుకు మహిళా ఏజెంట్ల నియామకం.
జూ మహిళా ఏజెంట్ (బీమా వాహక్) ఆ గ్రామంలోని కుటుంబాల మహిళా ప్రతినిధులను సంప్రదించి బీమా విస్తార్ పథకం కొనుగోలుతో ప్రయోజనాలు, పథకం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తారు.