Alcohol: మద్యం ద్వారా గతంలో ప్రభుత్వాలకు వందల కోట్ల ఆదాయం వస్తే… నేడు సింహభాగం ఆదాయం మద్యం ద్వారానే లభిస్తోంది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి మద్యం వ్యాపారాన్ని చేయక తప్పడం లేదు.. స్థూలంగా చెప్పాలంటే పేదల రక్త మాంసాల మీద మద్య వ్యాపారం చేస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు పోతున్నాయి. గతంలో కంటే మద్యం వినియోగం అధికంగా పెరగడం వల్ల రోగాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా మద్యం అధికంగా తాగే వారిలో లివర్ సిర్రోసిస్, మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బులు వంటివి చోటు చేసుకుంటున్నాయి. గతంలో మద్యం తాగే అలవాటు ఒక స్థాయి వయసు వారిలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు నూనూగు మీసాల వయసు ఉన్నవారు కూడా మద్యం తాగడానికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇటీవల పరిశోధనలో రోజు మద్యం తాగే వారు మాత్రమే కాకుండా, వీకెండ్స్ లో మద్యం తాగే వారు కూడా రోగాల బారిన పడుతున్నారని తెలుస్తోంది. వీకెండ్స్ లో మద్యం తాగేవారు తమకు ఏమి కాదనుకుంటే తప్పని.. వారికి కూడా వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చేసిన పరిశోధనలో పై విషయాలు విలడయ్యాయి.
వారంలో ఒక్కసారి తాగినా..
ఐటి, ఫార్మా రంగాలలో పనిచేసేవారు వీకెండ్స్ లో మద్యం తాగుతారు. వీకెండ్స్ లో తాగుతున్నాం కాబట్టి ఏమీ కాదని అనుకుంటారు. కానీ అది తప్పని.. దానివల్ల వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ” వీకెండ్స్ లో మద్యం తాగే అలవాటు వల్ల క్యాన్సర్ తలెత్తే ప్రమాదం లేకపోలేదు. గుండె, మూత్రపిండాలు, జీర్ణాశయం వంటి వాటి పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో అవయవాల వైఫల్యం చోటుచేసుకుని ప్రాణాలు పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక వీకెండ్స్ మద్యం తాగే విధానం చాలా ప్రమాదకరమని ప్రముఖ లివర్ డాక్టర్ సిరియాక్ ఫిలిప్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన వారంలో ఒకరోజు మద్యం తాగి 32 సంవత్సరాల యువకుడి లివర్ దెబ్బతిన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. ఆ యువకుడు వీకెండ్స్ లో మాత్రమే మద్యం తాగేవాడు. అందువల్ల అతడి లివర్ దారుణంగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో అతని భార్య లివర్ దానం చేసింది. అయితే ఆ లివర్ తో, అనారోగ్యానికి గురైన లివర్ తో ఫిలిప్ పోల్చాడు. మద్యం ఎంత మోతాదులో తీసుకున్నా ప్రమాదకరమని.. అది అనేక రకాల వ్యాధులకు కారణమవుతుందని ఫిలిప్ పేర్కొన్నారు. ” మద్యం అనేది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. దానిని మానుకోవడం ఉత్తమం. వీకెండ్ పేరుతో అడ్డగోలుగా తాగితే అవయవాలు పాడవుతాయి. ముఖ్యంగా లివర్ పనితీరు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఆ తర్వాత క్రమంగా అది లివర్ పాడవడానికి కారణం అవుతుంది. అందువల్ల వీకెండ్స్ మందు అలవాటును కూడా మానుకోవాలని” ఫిలిప్ సూచిస్తున్నారు.
ఈ సమాచారం వైద్యుల సూచనల ఆధారంగా తీసుకున్నది. ఇది వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నయం కాదని పాఠకులు గమనించగలరు.