For 100 Years Health : నూరేళ్లూ బలంగా… ఆరోగ్యంగా…

వాస్తవానికి, ప్రకృతి సహజ జీవనంలో నూరేళ్ల జీవితం అసాధ్యమేమీ కాదు. ఆయుర్వేదాన్ని ఆశ్రయించైనా, ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసుకోవచ్చు. శతవసంతాల్ని పూర్తిచేయవచ్చు..

Written By: K.R, Updated On : July 21, 2023 8:21 pm
Follow us on

For 100 Years Health : ప్రతి మనిషికీ జీవితకాలానికి సరిపడా పథకాలు, ఎన్నెన్నో ప్రణాళికలూ ఉంటాయి. జీవితకాలం అంటే ఏమిటి? నిండు నూరేళ్లు అని కదా! అయితే నూరేళ్లూ అహోరాత్రులు శ్రమించినా పూర్తికాని లక్ష్యాలు ఉంటాయి. అలాంటిది మధ్య వయసులోనే శరీరం మారాం చేస్తే, సర్వశక్తులూ ఉడిగిపోయి జీవచ్ఛవంలా మారిపోతే.. పథకాలూ, లక్ష్యాలూ గూడు చెదిరిన పక్షులవుతాయి. వాస్తవానికి, ప్రకృతి సహజ జీవనంలో నూరేళ్ల జీవితం అసాధ్యమేమీ కాదు. కాకపోతే, శరీరపు సహజస్థితిని దెబ్బతీసే పరిణామాలు అనేకం లోపలా, బయటా కొన్ని జరగుతూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఆయుర్వేదాన్ని ఆశ్రయించైనా, ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసుకోవచ్చు. శతవసంతాల్ని పూర్తిచేయవచ్చు..ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం అంటే మౌలికంగా, అమూల్యమైన రసాయనాల్ని ఆశ్రయించడమే. రసాయన చికిత్సల్ని ఆశ్రయించడమే.
జీవన యానంలో రసాయనం…
మనం తీసుకునే ఆహార  పానీయాలు శరీరంలోని  ఏడు ధాతువుల  ద్వారా అంటే వివిధ కణజాలాల ద్వారా శుద్ధి అవుతాయి. ప్రతి ధాతువులోనూ ఆహారంలోని జీవరసాన్నీ, వ్యర్థ పదార్థాన్నీ విడగొట్టే ప్రక్రియ సాగుతుంది. ఈ సప్తధాతువులను జీవరసం శుద్ధి చేస్తూ పోతుంది. జీవరసం అన్ని ధాతువులకూ చేరే ప్రక్రియ… మన జీవనశైలి, తీసుకునే ఆహారపానీయాలు, శరీరంలో జరిగే అన్ని రకాల జీవక్రియల మీద ఆధారపడి ఉంటుంది. మనలోని ధాతువుల పోషణకు, జీవచైతన్యానికి ఈ జీవరసమే ప్రాణం. ఈ జీవరసం ఒక ధాతువు నుంచి మరో ధాతువుకు అలా చివరి వరకూ చేరడానికి ఈ ఏడు ధాతువుల మధ్య మార్గం ఉంటుంది. ఆ మార్గాన్నే ఆయుర్వేద పరిభాషలో రసాయనం అంటారు. అయితే  వివిధ కారణాల వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కల్మషాలు జీవరసం ధాతువులకు చేరే రసాయన ప్రక్రియకు ఆటంకంగా మారతాయి.
మీ జీవనశైలి ఎలాఉంది?
ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడంతో పాటు ఆయుర్వేద వైద్యచికిత్సల ద్వారా ఈ రసాయన ప్రక్రియను సక్రమంగా ఉంచవచ్చు. అందుకే నిత్యం  సరైన  వ్యాయమాలు చేయడం, సమతుల ఆహారం, చక్కని పానీయాలు తీసుకోవడం చాలా అవసరం. రసాయన ప్రక్రియ సరిగ్గా సాగితే మొత్తం శరీర వ్యవస్థ అంతా సక్రమంగా ఉంటుంది. అయితే, భౌతిక అంశాలే కాకుండా మానసిక అంశాలు కూడా ఆయుఃప్రమాణాన్ని నిర్ణయిస్తా యనే సత్యాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. జ్ఞానేంద్రియాలకూ కర్మేంద్రియాలకూ మధ్య మనసు వారధిలా ఉంటుంది. రసపోషణ సరిగా ఉంటే శరీరమే కాకుండా మనసు కూడా స్థిరంగా, బలంగా ఉండాలి.  అలా ఉంచడంలో రసాయనాల పాత్ర కీలకం. రసాయన చికిత్స ఒక ధాతువు నుంచి మరో ధాతువుకు రసాన్ని చేరవేసే మార్గాన్ని సుగమం చేస్తుంది. రోగ నివారణకు ఉపయోగపడేవన్నీ ఈ రసాయనాలే. రసాయన చికిత్స శరీర కణజాలంలోని క్రియా శక్తిని, వాటి జీవన కాలాన్ని  పెంచుతుంది. కణాల పునరుత్తేజానికీ, పునరుత్పత్తికి ఈ చికిత్స తోడ్పడుతుంది. తద్వారా మనుషులను దీర్ఘాయుష్యులను చేస్తుంది.
పంచకర్మ చికిత్స
సాధారణంగా శరీరంలోని కణాలన్నీ మలినాలు, కల్మషాలతో పూడుకుపోయి ఉంటాయి.  జీర్ణ క్రియలు సరిగా లేనప్పుడు కూడా ఆహార పదార్థాలు పులిసిపోయి చివరికి అవే విష పదార్థాలుగా మారుతాయి. తద్వారా ధాతువులన్నీ మాలిన్యాలతో నిండిపోతాయి. ఈ స్థితిలో శరీరంలోని శ్రోతస్సులు (వాహికలు, నాళాలు, సిరలు, ధమనులు) మూసుకుపోవడం ఒక ప్రధాన సమస్య. వాహికలు మూసుకుపోతే రసాలు ఆ కణజాలానికి అందవు. అందుకే ఈ వాహికలను శుద్ధి చేయడానికి కూడా  పంచకర్మ చికిత్సలు చేయాలి. కణజాలంలోని మలినాలు తొలగిపోతేనే శ్రోతస్సులు శుభ్రమవుతాయి.  రసాలు లోనికి ప్రవేశించడానికి దారి ఏర్పడుతుంది.   అప్పుడు జీవరసాలు  కణాల్లోకి వెళ్లే చోటు ఉండదు. మలినాలు కణంలో నిండిపోతే ఆ కణజాలం పనితనం తగ్గిపోతుంది. దీనివల్ల మనిషి జీవన సామర్థ్యం తగ్గిపోతుంది. ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామన్నది ముఖ్యమే. అయితే తీసుకున్న ఆహార రసాలను ఆస్వాదించే స్థితిలో శరీరం ఉండడం అంతకన్నా ముఖ్యం. శరీరాన్ని ఆ స్థితిలో ఉంచడానికి పంచకర్మ చికిత్సలు అద్బుతంగా తోడ్పడతాయి. పంచకర్మ చికిత్సల తర్వాత రసాయన చికిత్స ప్రారంభించాలి. అప్పుడే  వైద్య రసాలతో పాటు ఆహారపానీయాల్లోని పోషకాలన్నీ శరీరంలోని సమస్త కణజాలాలకు  సక్రమంగా చేరతాయి.
అలాంటి ప్రధాన రసాయనాల్లో కొన్ని..
బ్రహ్మ రసాయనం
ఇది మొత్తం శరీరం మీద పనిచేస్తుంది. ప్రత్యేకించి మెదడును ఉత్తేజితం చేస్తుంది.
భల్లాతక రసాయనం
 కాలేయం, చర్మం మీద పనిచేస్తుంది.. ఒంటి నొప్పులను తగ్గిస్తుంది.
పిప్పళి వర్థమాన
రసాయనం
 ఇది కాలేయం, జీర్ణ వ్యవస్థ, క్లోమగ్రంథి మీద అద్భుతంగా పనిచేస్తుంది.
కుష్మాండ రసాయనం (బూడిద గుమ్మడి కాయ):
 ఇది మెదడు శక్తిని పెంచుతుంది.
వాతాతపిక రసాయనం, మేధ్య రసాయనం కూడా రసాయన చికిత్సలో కీలక పాత్ర వహిస్తాయి.