Homeహెల్త్‌15 Minute Walk Benefits: ఇక వర్కౌట్లు అవసరం లేదు.. రోజూ 15 నిమిషాలు ఇలా...

15 Minute Walk Benefits: ఇక వర్కౌట్లు అవసరం లేదు.. రోజూ 15 నిమిషాలు ఇలా చేస్తే.. ఆరోగ్యం మీ సొంతం.. ఏం చేయాలంటే..

15 Minute Walk Benefits: ప్రస్తుత బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చాల్సిందేనని చాలా మంది భావిస్తుంటారు. కానీ వైద్య నిపుణులు మాత్రం అలాంటి అపోహలు అవసరం లేదని అంటున్నారు. ప్రతిరోజూ కేవలం 10 నుంచి 15 నిమిషాల పాటు నడిచినా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. అయితే ఈ నడక క్రమపద్ధతిలో ఉండాలని, ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అసలు క్రమపద్ధతిలో నడక అంటే ఎలా ఉంటుంది?

సాధారణంగా చాలా మంది వాకింగ్ అనగానే నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజూ వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా నడవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోజువారీ నడక వల్ల శరీరంలో శక్తి పెరిగి అలసట తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గి ప్రశాంతత కలుగుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం.. పెద్దలు వారానికి 150 నుంచి 300 నిమిషాల పాటు మితమైన శారీరక వ్యాయామం చేయడం మంచిది. ఇందులో వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత, జాగింగ్ వంటి వ్యాయామాలు ఉండొచ్చు. ఇవి శరీరాన్ని చురుకుగా ఉంచడమే కాకుండా మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

కేవలం కార్డియో వ్యాయామాలే కాకుండా వారానికి కనీసం రెండుసార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కూడా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్వాట్స్, పుష్‌అప్స్, తేలికపాటి బరువులతో చేసే వ్యాయామాలు లేదా యోగా వంటి కార్యకలాపాలు కండరాల బలం పెంచి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. వయసు పెరిగే కొద్దీ కండరాల బలహీనతను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి.

చాలామంది రోజుకు 10 వేల అడుగులు నడవాలనే లక్ష్యాన్ని ఒత్తిడిగా తీసుకుంటుంటారు. అయితే ఆరోగ్యానికి అది తప్పనిసరి కాదని వైద్యులు చెబుతున్నారు. మీ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా, మీకు నచ్చిన వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం మరింత ముఖ్యమని సూచిస్తున్నారు. తక్కువ సమయం అయినా ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు.

వ్యాయామంతో పాటు తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ, స్థిరమైన జీవనశైలి కూడా ఆరోగ్యానికి కీలకం. రోజుకు 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి విశ్రాంతిని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పోషకాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే భారీ లక్ష్యాల కంటే చిన్న చిన్న అలవాట్లను ప్రతిరోజూ పాటించడం ఎంతో ప్రభావవంతం. రోజుకు 10-15 నిమిషాల నడక, వారానికి తగినంత వ్యాయామం, కండరాల బలోపేతానికి శిక్షణ, సరైన నిద్ర, సమతుల్య జీవనశైలిని అలవాటు చేసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశాలు మరింత పెరుగుతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version