Homeఅంతర్జాతీయంఅమెరికా-తాలిబన్ల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం!

అమెరికా-తాలిబన్ల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం!

నిత్యం బాంబులు, తుపాకుల మోతలతో గత 19 ఏళ్లుగా మొత్తం దక్షిణ ఆసియాలో నిప్పుటి కుంపటి వలే అగ్గి రాజేస్తున్న ఆఫ్ఘానిస్తాన్ లో ప్రశాంతత నెలకొనడం కోసం అమెరికా, బలిబాన్ల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం జరిగింది. ఖతర్‌లోని దోహాలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్‌, తాలిబన్ల ప్రతినిధి ముల్లా బరదర్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం తాలిబన్లు ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలి. తమ ప్రాంతాల్లో ఇతర సంస్థల ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదు. మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు 14 నెలల్లోగా ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి పూర్తిగా తన బలగాలను ఉపసంహరిస్తాయి. తొలిదశగా అమెరికా 135 రోజుల్లో 8,600 మందిని వెనక్కి రప్పిస్తుంది.

అయితే.. ఈ ఒప్పందం అమలుకావాలంటే తాలిబన్లు, ఆఫ్ఘన్‌ ప్రభుత్వం మధ్య ఈ నెల 10న జరిగే చర్చలు కీలకం కానున్నాయి. వీరి మధ్య రాజకీయ ఒప్పందం కుదిరితే యుద్ధం ముగుస్తుంది. ఈ నెల 10న నార్వే రాజధాని ఓస్లోలో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరికి నమ్మ కం కుదిరేలా బందీలను విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఐదువేల మంది తాలిబన్లను విడుదల చేస్తుండగా, తాలిబన్లు వెయ్యి మంది ఆఫ్ఘన్‌ సైనికులకు విముక్తి కల్పించనున్నారు. మరోవైపు తాలిబన్లు శనివారం నుంచి దేశవ్యాప్తంగా సైనిక కార్యకలాపాలను నిలిపివేశారు.

విదేశాంగ మంత్రి మైక్‌పాంపియో ఈ సందర్భంగా మాట్లాడుతూ తాలిబన్లు మాట నిలబెట్టుకోవాలని, ఆల్‌ఖైదాతో సంబంధాలు తెంచుకోవాలని స్పష్టంచేశారు. తాలిబన్లు, ప్రభుత్వం మధ్య చర్చలు విఫలమైనా, వారి రాజకీయ ఒప్పందం సక్రమంగా అమలుకాకపోయినా మళ్లీ బలగాలను మోహరిస్తామని సంకేతాలిచ్చారు.

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న జంట టవర్లపై 2001 సెప్టెంబర్‌ 11న (9/11) ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలోని ఆల్‌ఖైదా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్టు అమెరికా గుర్తించింది. ఆ సమయంలో తాలిబన్లు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు. దీంతో అమెరికా నేతృత్వంలో ని సంకీర్ణ సేనలు, నాటో బలగాలు తాలిబన్లపై విరుచుకుపడ్డాయి.

అమెరికా ఈ యుద్ధం కోసం ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దాదాపు 2,400 అమెరికా మంది సైనికులు మరణించారు. వేలమంది తాలిబన్లు, ఆఫ్ఘన్‌ సైనికులు, లక్షల మంది పౌరులు మరణించారు. దాదాపు 25 లక్షల మంది శరణార్థులుగా మారగా, దాదాపు 20 లక్షల మంది సొంత దేశంలోనే వలస వెళ్లారు.

అమెరికా యుద్ధంతో ఐదేండ్లలోనే తాలిబన్లు అధికారాన్ని కోల్పోయారు. సంస్థ పూర్తిగా బలహీనపడింది. దీంతో వారు అమెరికాతో సంధికి సిద్ధపడ్డారు. మధ్యవర్తిత్వం వహించడానికి ఖతార్‌ ముందుకొచ్చింది. 2011 నుంచి తాలిబన్‌ నేతలకు ఆతిథ్యం ఇస్తున్నది. వారి కోసం 2013లో ఒక కార్యాలయాన్ని తెరిచింది. అయితే జెండా విషయంలో వివాదం తలెత్తడంతో అదే ఏడాది కార్యాలయాన్ని మూసివేశారు. చర్చల ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి.

దాదాపు ఐదేండ్ల తర్వాత 2018లో తాలిబన్లు మరోసారి అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఆ తర్వాత ఇరు వర్గాల ప్రతినిధులు దాదాపు తొమ్మిది విడుతలుగా సమావేశమయ్యారు. సూత్రప్రాయ ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం 20 వారాల్లో 5,400 మంది సైనికులను ఉపసంహరించుకుంటామని 2019 సెప్టెంబర్‌లో అమెరికా ప్రకటించింది.

అయితే కొన్ని రోజులకే తాలిబన్లు అమెరికా సైనికుడిని చంపడంతో చర్చల ప్రక్రియ నుంచి బయటికి వస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ చర్చలు మొదలై.. తాజా శాంతి ఒప్పందం కుదిరింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular