తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ద్వారా 2023 ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం కోసం ప్రయత్నిస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఒంటరివారయ్యారా? అవుననే అనిపిస్తున్నది. ఆయన అభ్యర్థిత్వం పట్ల పార్టీలో సానుకూలత కరువు కాగా, రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది.
ఈ పదవి కోసం చిరకాలంగా ప్రయత్నం చేస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి తొలినుండి పార్టీలో ఉంటున్న వారికే ఈ పదవి ఇవ్వాలని స్పష్టం చేసారు. పార్టీలో అనేకమంది సీనియర్లు సహితం అటువంటి డిమాండ్లు చేస్తున్నారు.
బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలినుంచి పార్టీలో ఉన్న వ్యక్తినే నియమించిందని, ఇందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను ఆమెకు చూపించినట్లు సమాచారం. కాంగ్రెస్ కోసం కష్టపడేవారికి పదవులు వస్తాయన్న సంకేతం పంపించాలని అభ్యర్థించారు.
మరోవంక పరోక్షంగా రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టడం కంటే ఆరేళ్లుగా ఉంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించడం మేలని మాజీ ఎమ్యెల్యే జగ్గారెడ్డి పార్టీ నాయకత్వానికి సూచించారు.
డ్రోన్ ఫోటోలు తీసిన కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి జైలులో ఉంటె చాలామంది సీనియర్ నాయకులు ఏమీ పట్టించుకొనక పోవడం గమనార్హం. అది పార్టీకి సంబంధం లేని వ్యవహారం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే ఆయనను రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ గా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అందుకు సీనియర్ల నుండి వ్యతిరేకత వ్యక్తం కావడంతో పిసిసి కార్యనిర్వాహక అధ్యక్ష పదవితో సరిపెట్టుకో వలసి వచ్చింది. ఆ పదవిలో ముగ్గురు ఉన్నారు. అది కేవలం అలంకారప్రాయంగా పదవి కావడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రేవంత్ వ్యక్తిగత అజెండాతో ముందుకు వెడుతున్నారనే ఆరోపణలు సహితం కాంగ్రెస్ వర్గాల నుండి వస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటాలకు, ఇస్తున్న ప్రకటనలకు చాలామంది కాంగ్రెస్ నాయకుల నుండి స్పందనే కనబడటం లేదు.