
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని సీఎం జగన్.. చేయకూడదని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చెరో రూట్ లో ఫైట్ చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి పేరిట అక్కడి రైతులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇటు విశాఖ వాసులు తమ ప్రాంతానికి రాజధాని రావాలని సమర్థిస్తున్నారు.
Also Read: బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?
ఏపీ కార్యనిర్వాహక రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నంకు మార్చాలనే విషయంలో పార్టీల్లో కూడా నాయకులు చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సీమ, ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర నేతలు, ప్రజలు జగన్ సర్కార్ నిర్ణయంపై విడిపోయారు.
అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా రాజధాని ఎక్కడికి మార్చినా పోయి విధులు నిర్వర్తించడం వారి విధి. కానీ తాజాగా హైకోర్టులో జరుగుతున్న రాజధాని మార్పులోకి సచివాలయ ఉద్యోగులు కూడా ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు మార్చడాన్ని సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. వెంకటరామిరెడ్డి హైకోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. రాజధాని ప్రాంతానికి మారడానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలను పాటించడం తప్ప ఉద్యోగులకు వేరే మార్గం లేదని.. తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?
అయితే ఉద్యోగుల్లో దీనిపై నిరసన వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వ వాదనను తలకెత్తుకోవడంపై మండిపడుతున్నారు.
అమరావతి రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా మనం ఎందుకు వ్యాఖ్యలు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కోర్టు నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అది ప్రభుత్వం అనుసరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించలేనప్పుడు, ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా ఎందుకు వ్యాఖ్యానించాలని ఉద్యోగుల్లోని ఒక వర్గం వాదిస్తోంది.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికోసం పనిచేస్తారు. కానీ ప్రస్తుతం ఉద్యోగులు కూడా పార్టీల వారీగా చీలిపోయి ఏకంగా ప్రభుత్వాలకు మద్దతుగా హైకోర్టులో పిటీషన్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.