కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర గవర్నర్లు మాత్రం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పుచేతలలో వ్యవహరిస్తూ ఉండడం తెలంగాణ బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. గత గవర్నర్ నరసింహన్ కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరించడమే కాకుండా, పలు అంశాలలో తన పరిధి మించి వ్యవహరించడం తెలంగాణ బిజెపి నేతలకు ఆగ్రహం కలిగించింది.
ఈ విషయమై కేంద్రంలో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఢిల్లీలో కీలకమైన వ్యక్తికి సన్నిహితుడు కావడంతో దేశంలో ఇప్పటి వరకు మరే గవర్నర్ కు వీలు కానీ రీతిలో సుమారు పుష్కరకాలం పాటు రాజ్ భవన్ లో ఉండగలిగారు.
గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన వ్యక్తి కావడంతో, తమ మాట వినడం లేదని అనుకున్న బిజెపి నేతలు తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్ ని గవర్నర్ గా నియమించడంతో ఆనందపడి పోయారు.
కేసీఆర్ దుందుండుకు చర్యలకు ఇక ముక్కు తాడు వేయవచ్చని సంబరపడ్డారు. అయితే ఆమె వ్యవహార శైలి సహితం వారిని కలవరానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా మొదటిసారిగా శాసనసభలో ఆమె చేసిన ప్రసంగం వారిని షాక్ కు గురిచేసింది. కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఆమె మాట్లాడటం విస్మయానికి గురి చేసింది.
పశ్చిమ బెంగాల్, కేరళ వంటి బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలలోగవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉండగా, ఇక్కడ మాత్రం ఆమె కూడా కేసీఆర్ ప్రభావంలో వ్యవహరిస్తున్నారనే అసంతృప్తి బిజెపి వర్గాలలో వ్యక్తం అవుతున్నది. మంచి చీరెలను బహుమానంగా ఇవ్వడంతో ఆమె పొంగిపోయిన్నట్లున్నారు అంటూ ఒక బిజెపి నేత ఎద్దేవా చేశారు.
రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసిన ప్రసంగం చదవవలసి ఉన్నప్పటికీ వ్యక్తిగత పొగడ్తలను నివారించడానికి ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ఈ సందర్భంగా బిజెపి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సిఏఏ పై కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అక్కడి గవర్నర్ తన తీర్మానంలో ప్రస్తావిస్తూ ఈ విషయంలో తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నట్లు ఈ సందర్భంగా గమనార్హం.
రాష్ట్రంలో టి ఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని తాము ప్రయత్నం చేస్తుంటే, తమ గవర్నర్ మాత్రం అధికార పక్షంపై అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండటం ఏమిటని పలువురు బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై త్వరలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.