తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సీఎం గిరీ.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈసారి ఆ ప్రచారం మరింత పీక్స్‌కి చేరింది. గతంలో చాలా సార్లు కేటీఆర్ సీఎం అని వినిపించినప్పటికీ పార్టీ పట్ల కొంత అసంతృప్తిలో ఉన్న వారిని ఏకతాటి పైకి తెచ్చేందుకు బ్రేక్ పడినట్లు సమాచారం. అందుకే.. ఇప్పుడు వారు కూడా ఏకంగా కేటీఆర్‌కు పగ్గాలు ఇవ్వాల్సిందేనంటూ బాహాటంగా పేర్కొంటున్నారు. కేసీఆర్ కంటే కేటీఆర్ పార్టీకి, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తమ్మీద పార్టీలో సీనియర్ నాయకుడు అయిన హరీశ్ రావు వర్గానికి మినహా మిగిలిన వారంతా ఏకాభిప్రాయానికి వచ్చేసినట్లేనని కనిపిస్తోంది.
Also Read: తొలిరోజే జోబైడెన్ సంచలన నిర్ణయాలివీ..
కేటీఆర్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఆ కాస్త ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేస్తే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది. అయితే కేసీఆర్ ఆ తర్వాత ఏం చేస్తారనేంది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న. గతంలో జాతీయ రాజకీయాల నెపంతో తనయుడిని పీఠంపై కూర్చోబెట్టి హస్తినలో చక్రం తిప్పాలని భావించారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవు. కేసీఆర్ స్థాయిలో ఢిల్లీలో చేయాల్సిన పనులు పెద్దగా ఏమీ లేవు. టీఆర్ఎస్ హస్తిన చదరంగంలో పావులు కదిపేందుకు అనువైన వాతావరణమూ లేదు. అయినా కేటీఆర్ ను సీఎం చేయాలనుకోవడమే ఆసక్తిదాయకం. మరోవైపు.. ఆ మేరకు పార్టీ నుంచి ఒత్తిడి పెరిగిందనే టాక్ కూడా వినిపిస్తోంది.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ప్రగతి భవన్‌కే పరిమితం అవుతున్నారు. తొలిసారి ఎన్నికైన తర్వాత ఏదో కొద్దికాలం సెక్రటేరియట్‌కు వెళ్లారు. తప్పితే సచివాలయం మొఖం చూసిన దాఖలాలు లేవు. మిగిలిన ముఖ్యమంత్రుల తరహాలో సమీక్షలు, పర్యటనలు కూడా పెద్దగా నిర్వహించడం లేదు. ఎన్నికల వంటి సందర్భాల్లో మాత్రమే కనిపిస్తూ ప్రసంగిస్తారు. అప్పుడప్పుడూ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మీడియాతో మాట్లాడతారు. అందుకే సీఎం కార్యాలయం పెద్దగా చర్చల్లో ఉండదు.
Also Read: అమెరికన్ల ఐక్యతే జోబైడెన్ మంత్రం..
అయితే.. గత రెండేండ్లుగా తెలంగాణలో మరో వింత పరిస్థితి నెలకొంది. అదేంటంటే.. ముఖ్యమంత్రి నిర్వహించాల్సిన మంత్రుల స్థాయి సమీక్షలను కూడా ఆయన తనయుడు కేటీఆర్ నిర్వహిస్త్తున్నారు. ఇప్పటికే 99 శాతం కేసీఆర్ బాధ్యతలను కేటీఆర్ చూస్తున్నారని సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ తేల్చి చెప్పడం కూడా ఇందుకు నిదర్శనం. పదవీ స్వీకరణ లాంఛనప్రాయమేనని ఆయన అభిప్రాయపడ్డారు. భజన బృందాలుగా వ్యవహరించే నాయకులు చేసే ప్రకటనలు వేరు. ఈటల వంటి సీనియర్ మంత్రి.. అందులోనూ ఉద్యమంతో ముడిపడిన వ్యక్తి స్పష్టంగా చెప్పడంతో దాదాపు ఈ నిర్ణయం జరిగిపోయిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమైనప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళికలు, విధివిధానాల విషయంలో చురుకైన పాత్రనే పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అజెండాకు సిద్ధాంతకర్తగా తనను తాను నిర్వచించుకుంటున్నారు. నిజానికి ఇప్పటివరకూ రాష్ట్రంలో కేసీఆర్ కు ఎదురు లేదు. కానీ.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఇమేజీ తగ్గుతూ వస్తోంది. బీజేపీ విసురుతున్న సవాల్ కు దీటైన సమాధానం చెప్పలేకపోతోంది. నాయకులు, అధికార యంత్రాంగం పటిష్ఠంగా ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ ను బీజేపీ నాయకులు సవాల్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ బొమ్మలేదని ముఖ్యమంత్రి ఫ్లెక్సీని బీజేపీ నేతలు చింపేశారు. అధికారులు, టీఆర్ఎస్ నాయకుల సంఖ్యతో పోలిస్తే బీజేపీ అక్కడ నామమాత్రమే. కానీ.. బీజేపీలో నెలకొన్న దూకుడు ధోరణికి ఇటువంటి సంఘటనలు అద్దం పడుతున్నాయి. మొత్తంగా కేటీఆర్ సీఎం నినాదం మరోసారి తెరపైకి రావడం.. ఈసారి చాలా మంది నేతల నోళ్ల నుంచి ఆ వ్యాఖ్యలు వినిపిస్తుండడంతో ముహూర్తం దగ్గర పడినట్లే కనిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్