బిసిలకు పెంచిన రేజర్వేషన్లను హై కోర్ట్ కొట్టి వేయడంతో, మొత్తం రేజర్వేషన్లను 50 శాతంకు మించకుండా చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయమై బీసీలలో రాగాల స్పందనపై జాగురతతో అడుగులు వేస్తున్నది.
బిసిలు మొత్తం మీద టిడిపి మద్దతుదారులుగా ఉన్నప్పటికీ, గత ఎన్నికలలో చెప్పుకోదగినంతమంది వైసీపీకి ఓట్ వేయడంతో వారిని కాపాడుకోవడం ఇప్పుడు ప్రశ్నగా మారింది.
అందుకనే బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బిసి రేజర్వేషన్ల అంశంపై ఎవ్వరు నోరు విప్పవద్దని జగన్ ఆదేశించారు. బిసిల రిజర్వేషన్లు తగ్గుతుండటం వల్ల సుమారుగా 1600 మంది బిసి ప్రతినిధులు అన్ని స్థాయిల్లోనూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.
దీనిమీద ఎంత ఎక్కువ చర్చ జరిగితే వైసిపికి అంత ఎక్కువగా నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాన్ని మంత్రులు అందరు వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని బిసిల సానుభూతి కోసం టిడిపి వ్యూహరచన చేస్తున్నది. హై కోర్ట్ తీర్పును సుప్రీం కోర్ట్ లో సవాల్ చేయనున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోవంక, టిడిపి ప్రతినిధి వర్గం గవర్నర్ హరిచందన్‌ను కలిపి ఈ విషయమై వినతి పత్రం ఇచ్చింది.
‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడం వల్ల 140 వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 16 వేల పదవులను బీసీలు కోల్పోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా బీసీలను అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. బీసీలు టీడీపీకి అండగా ఉంటున్నారన్న అక్కసుతోనే జగన్ ఈ విధంగా చేస్తున్నారు’’ అని టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు గవర్నర్ కు వివరించారు.
బీసీలకు 1987వ సంవత్సరం నుంచి 34 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లు 24 శాతానికి పరిమితం అయ్యాయని అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలకు నాడు తండ్రి, నేడు కొడుకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.
బీసీలకు రేజర్వేషన్లను 24 శాతంకు కుదిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకు రాదలచిన ఆర్టినెన్స్ ముందుగా గవర్నరు వద్దకు వస్తుంది కాబట్టి దాన్ని తిరస్కరించాలని వారు కోరారు.