Another Epidemic In AP: కొవిడ్ విపత్తు నుంచి తెరుకుంటున్న దేశానికి మంకీపాక్స్ రూపంలో మరో కొత్త సవాల్ ఎదురవుతోంది. కొవిడ్ సృష్టించిన విలయతాండవం కళ్లేదుటే కనిపిస్తుండగా.. ఇప్పుడు కొత్త విపత్తు కలవరపరుస్తోంది. తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది, దేశంలో క్రమేపీ మంకీపాక్స్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో కరోనా కేసులు సైతం నమోదవుతున్నాయి. అయితే రెండు మహమ్మారిలు ఒకేసారి వెలుగుచూస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మంకీపాక్స్ అనుమానిత కేసులు బయటపడుతున్నాయి. కేరళలో నాలుగు కేసులు నిర్థారణ అయ్యాయి. తాజాగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో సైతం నిర్థారణ అయ్యాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం అనుమానిత కేసులు వెలుగుచూశాయి. ఏపీలో తొలి అనుమానిత కేసు గుంటూరులో బయటపడింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విపత్తుపై స్పందించింది. స్పెషల్ టాస్కు ఫోర్స్ ను ఏర్పాటుచేసింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మంకీ పాక్స్ అనుమానిత లక్షణాలు, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ విధి విధానాలను ప్రకటించింది. దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చింది. అయితే రోజురోజుకూ పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు మాత్రం సగటు మానవుడికి ఆందోళనకు గురిచేస్తున్నాయి. శరీరంపై చిన్నపాటి దద్దుర్లు కనిపించినా ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.

ల్యాబ్ లకు నమూనాలు…
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో మంకీపాక్స్ అనుమానిత కేసులు బయటపడ్డాయి. తెలంగాణలోని కామరెడ్డి జిల్లాలో ఒక మంకీపాక్స్ కేసు నమోదైంది. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్సపొందుతున్నాడు. అనుమానితుడు నుంచి రక్తనమూనాలు సేకరించి పూణేలోని ఎన్ఐవీకి పంపించారు. అటు ఏపీలోని పల్నాడు జిల్లాలో ఒక బాలుడిలో అనుమానిత లక్షణాలను గుర్తించారు. చేతిపై దద్దుర్లుతో బాధపడుతున్న 8 సంవత్సరాల బాలుడ్ని తల్లిదండ్రులు గుంటూరులోని జీజీహెచ్ కు తీసుకొచ్చారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు దానిని మంకీపాక్స్ గా భావిస్తున్నారు. దీంతో బాలుడి నుంచి రక్త నమూనాలు సేకరించి సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆ నివేదికను అనుసరించి తదుపరి ప్రణాళికను ప్రకటిస్తామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బాధిత బాలుడ్ని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులది ఒడిశా. పల్నాడు జిల్లాకు ఉపాధి కోసం వచ్చారు. దీంతో స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాలుడు నివాసముంటున్న ప్రాంతంలో వైద్య పరీక్షలు ముమ్మరం చేశారు.
రెడ్ అలెర్ట్?
అటు ఉభయ తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రధానంగా విదేశాల నుంచి వస్తున్న వారిలో అనుమానిత లక్షణాలు కనిపించడంతో అటువైపు దృష్టిపెట్టాయి. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నాయి. వారి నుంచి నమూనాలు సేకరించే పనిలో పడ్డాయి. కామారెడ్డిలో అనుమానితుడికి నెగిటివ్ గా రిపోర్టు వచ్చింది. అటు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వ్యక్తితో పాటు గంటూరులో చికిత్సపొందుతున్న బాలుడి నుంచి నమూనాలు ప్రస్తుతం ల్యాబ్ లో ఉన్నాయి. వాటి నివేదికలు వచ్చిన వెంటనే తదుపరి వైద్య చికిత్సలు ప్రారంభించనున్నారు. అనుమానిత కేసులు పెరిగితే మాత్రం రెడ్ అలెర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. కొన్నిరకాల ఆంక్షలు అమలుచేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే ఇప్పుడిప్పుడే కొవిడ్ కలకలం నుంచి బయటపడుతున్న నేపథ్యంలో మంకీపాక్స్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.