Homeజనరల్Mother Made Robot For Daughter: అక్షరం ముక్క రాదు: కూతురి కోసం అమ్మ రోబో...

Mother Made Robot For Daughter: అక్షరం ముక్క రాదు: కూతురి కోసం అమ్మ రోబో తయారు చేశాడు

Mother Made Robot For Daughter: మీరు రోబో సినిమా చూశారా?! అందులో మనిషి అవసరాలు తీర్చేందుకు రజనీకాంత్ హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తాడు. అదంటే సినిమా. ఫిక్షన్ పాలు ఎక్కువగా ఉంటుంది. నిజ జీవితంలో దివ్యాంగురాలైన ఓ కూతురికి సపర్యలు చేసే అమ్మ రోబోను సృష్టించాడు ఓ తండ్రి. అలా అని అతడేం ఐఐటీ ఖరగ్ పూర్ లోనో, హైదరాబాద్ త్రిబుల్ ఐటీ లోనో చదవలేదు. ఆ లెక్కకు వస్తే అతడికి అక్షరం ముక్క రాదు. కానీ నేర్చుకోవాలనే తపన, ఏదో చేయాలనే ఆరాటం అతడిని రోబోను సృష్టించే శాస్త్రవేత్తగా మలిచింది. అందుకే అంటారు అభ్యాసం కూసు విద్య అని..
..
దక్షిణ గోవాలోని పోండా తాలూకా బేతోరా గ్రామానికి చెందిన బిపిన్ రోజువారి కూలీ. ఎటువంటి డిగ్రీలు, చదువులు లేని సాదాసీదా వ్యక్తి. కానీ తన బిడ్డ పై ప్రేమ అతడిని ఒక రోబోను కనిపెట్టేలా చేసింది. బిపిన్ కు భార్య, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. బిపిన్ కుమార్తె దివ్యాంగురాలు. ఆయన భార్య కూడా అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మంచం పట్టింది. కుటుంబ భారం మొత్తం బిపిన్ మీద పడటంతో.. రోజు కూలికి వెళ్లేవాడు.. పని మధ్యలో ఇంటికి వచ్చి తన బిడ్డకు అన్నం తినిపించి తిరిగి వెళ్లేవాడు. కానీ తన బిడ్డ ఎవరి మీదా ఆధారపడకుండా తినేలా ఏదైనా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. తన భార్య కూడా పదేపదే కోరుతుండటంతో ఒక ఆలోచనకు వచ్చాడు. ప్రస్తుతం యూట్యూబ్లో అనేక అంశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్లో సాఫ్ట్వేర్ కు సంబంధించిన కనీస అంశాలపై అవగాహన పెంచుకున్నాడు. ఓవైపు 12 గంటల పాటు నిరంతర కూలి పని… ఇంటికి రాగానే రోబో గురించి పరిశోధన.. ఇలా రేయింబవళ్లు సాగిన అతడి కృషి ఎట్టకేలకు ఫలించింది. దివ్యాంగురాలైన తన కుమార్తెకు ఆహారం అందించగలిగే రోబోను బిపిన్ తయారు చేశాడు.

Mother Made Robot For Daughter
Mother Made Robot For Daughter

..
ఆ రోబోకు అమ్మ అని పేరు పెట్టాడు
..
బిడ్డ ఆకలితో ఉంటే తల్లి మనసు ఊరుకుంటుందా? గోరుముద్దలు తినిపిస్తూ, లోకాన్ని చూపిస్తూ.. కడుపు నింపుతుంది. అలాగే బిపిన్ తన కుమార్తెకు ఆహారం తినిపించే రోబోకు అమ్మ రోబో అని పేరు పెట్టాడు. కూతురి మాట వినపడగానే రోబో ఆమె దగ్గరికి వెళుతుంది. ఆహారాన్ని అందిస్తుంది. తాను ఏం తినాలి అనుకుంటున్నానో చెబితే.. అదే పదార్థాన్ని బాలిక నోటికి రోబో తినిపిస్తుంది. “ప్రధానమంత్రి మోడీ ఆత్మ నిర్భర్ భారత్ గురించి పదేపదే చెబుతుంటారు. ఆ తరహా లోనే నేను కూడా ఎవరి మీదా ఆధారపడకుండా రోబోను అభివృద్ధి చేసుకున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని రోజులను తయారుచేసి నా బిడ్డ లాంటి చిన్నారులకు అందిస్తాను. దీనిని నేను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ చూపించాలనుకుంటున్నాను” అని బిపిన్ తెలిపారు. మొన్న నిన్నటి దాకా సాధారణ కూలిగా కనిపించిన బిపిన్.. ఇవాళ తన కూతురి కోసం అమ్మ రోబో తయారు చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడు తన రోబోను మరింతగా ఆధునీకీకరించేందుకు
గోవా రాష్ట్ర ఆవిష్కరణల మండలి అవసరమైన నిధులను అందించేందుకు ముందుకు వచ్చింది. రానున్న రోజుల్లో దీన్ని మరింత వాణిజ్యంగా తయారుచేసి మొదలు పెట్టేందుకు బిపిన్ ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. వీటివల్ల ఎంతోమంది దివ్యాంగులకు సరైన సమయానికి ఆహారాన్ని అందించేందుకు అవకాశం ఉంటుంది.
..
ఎలా తయారు చేశాడంటే
..
ఆన్లైన్లో చెప్పిన విధంగా బిపిన్ తన కూలీ సొమ్ములో కొంత మొత్తాన్ని రోబో తయారీకి కేటాయించుకున్నాడు. ఇందుకుగాను తన ఖర్చులను పూర్తిగా తగ్గించుకున్నాడు. రోబో తయారీ కి కీలకం చిప్ లే. వాటిని సమీప ఎలక్ట్రానిక్ దుకాణాల్లో కొనుగోలు చేశాడు. రోబో ఆకృతి రావడానికి కావలసిన తల ఇతర భాగాలను గోవాలోనే కొనుగోలు చేశాడు. ఆన్లైన్లో చెప్పిన విధంగా ఆ చీప్ లకు ఒక ప్రోగ్రామింగ్ రూపొందించి రోబోలోకి అమర్చాడు. పాప నోటి మాట విన్న వెంటనే రోబో కదిలి వచ్చేలా ఏర్పాటు చేశాడు. ట్రయల్ రన్ లో కొన్ని అవాంతరాలు తలెత్తినప్పటికీ.. వాటిని సరి చేస్తూ రోబోను మరింత అధునాతనంగా తీర్చిదిద్దాడు. దీనివల్ల అతడు లేకున్నా ఆ రోబో ఆ బాలికకు ఆహారం తినిపిస్తోంది. ఎప్పుడైతే రోబో ఆహారం తినిపించడం ప్రారంభించిందో.. అతడి కూతురి మానసిక పరిపక్వత కూడా పెరిగింది. గతంలో ఎన్ని మందులు వాడినా క నిపించని ప్రయోజనం రోబో ద్వారా అతని కూతురికి లభించింది. ఇటీవల ఇలాంటి తరహా కథతోనే మలయాళంలో ఆండ్రాయిడ్ కట్టప్ప 2.0 అనే సినిమా వచ్చింది. కాకపోతే అందులో వృద్ధుడైన తన తండ్రి బాగోగులు చూసుకునేందుకు ఓ యువకుడు రోబోను ఇంట్లో ఉంచుతాడు. ప్రస్తుతం మనం టేక్ యుగంలో ఉన్నాం. ఏం చేయాలన్నా, చేయొద్దు అనుకున్నా బొటనవేలితో టచ్ చేసే దూరంలోనే ఉన్నాం. అలాంటి అవసరాలే కొత్త కొత్త ఆవిష్కరణల వైపు మనుషులను నడిపిస్తున్నాయి. గోవాకు చెందిన బిపిన్ కూడా అలాంటివాడే. ఆ జాబితాలో ఇతడిది ప్రత్యేక స్థానం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular