AP Free Ration: కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పంపిణీ గత మూడు నెలులుగా ఏపీలో నిలిచిపోయింది. దేశంలో అన్ని రాష్ట్రాలు అందిస్తున్నా మన రాష్ట్రంలో జగన్ సర్కారు నిలిపివేసింది. దీనికి అనేక కారణాలు ఎత్తిచూపుతోంది. ఏప్రిల్ వరకూ అందించి తరువాత చేతులెత్తేసింది. తమపై ఆర్థిక భారం పడుతోందని.. అందుకే బియ్యం అందించలేమని చెప్పుకొస్తోంది. 2020 మార్చిలో కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. ప్రజా జీవితం అతలాకుతలమైంది. ఉపాధి లేక నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం పంపిణీని ప్రారంభించింది. గత రెండేళ్లుగా బియ్యం అందిస్తూ వచ్చింది. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టినా బియ్యం పంపిణీ మాత్రం నిలిచిపోలేదు. సెప్టెంబరు వరకూ అందించాలని నిర్ణయించింది. కానీ ఏపీలో మాత్రం మే, జూన్ నెలలకు సంబంధించి పేదలకు ఉచిత బియ్యం అందలేదు. జూలై నెలా ప్రశ్నార్థకమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలు లేకపోవడమే ఇందుకు కారణంగా చూపుతోంది. దీంతో ఏపీలో నిరుపేద రేషన్ లబ్ధిదారులు ఎదురుచూపులు తప్పడం లేదు. అదిగో ఇదిగో అంటూ చెబుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వలేమని చేతులెత్తేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పక్క రాష్ట్రాల్లో అందించి ఇక్కడ మాత్రం విస్మరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.
గణాంకాలివి..
రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం అందించనున్నట్టు ప్రకటించింది. పేదలకు మెరుగైన ఆహారం అందించడంలో భాగంగా సన్న బియ్యం అందించనున్నట్టు చెప్పుకొచ్చింది. కానీ తరువాత మాట మార్చింది. కేవలం బియ్యంలో ఉన్న నూకలు తీసి నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందుకుగాను మిల్లర్లకు సార్టెక్స్ మిషన్లు పెట్టుకోవాలని ఆదేశించింది. దీంతో అదనపు భారమైనా ప్రభుత్వ ఆదేశాలతో మిల్లర్లు సార్టెక్స్ మిషన్లు అమర్చుకున్నారు. అయితే ఇంతలో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ నేపథ్యంలో ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. నెలలో తొలి పక్షం రెగ్యులర్ గా రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన బియ్యం అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని రెండో పక్షంలో అందిస్తూ వస్తున్నారు. మొన్న ఏప్రీల్ వరకూ రెండు కోటాల బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలు నిండుకోవడంతో అప్పటి నుంచి ఉచిత కోటాను నిలిపివేసింది.
Also Read: July 1 Changes: జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివేనా?
కేంద్రానిదే సింహభాగం..
సాధారణంగా లబ్ధిదారుడికి అందించే రేషన్ బియ్యం వాటాలో కేంద్ర ప్రభుత్వం వాటాయే సింహభాగం. కిలో బియ్యం రూ.35లుగా నిర్ణయిస్తే.. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.30, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5. రేషన్ పంపిణీ నిర్వహణ బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే. జగన్ సర్కారు అందిస్తున్న నాణ్యమైన బియ్యం పంపిణీకి మరో రూ.1.50 అదనంగా ఖర్చవుతోంది.అంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కో కిలో బియ్యంపై ఖర్చు చేస్తోంది అక్షరాల రూ.6.50 అన్న మాట. మరోవైపు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏపీలో గుర్తించిన రేషన్ కార్డులు కేవలం 80 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఇబ్బడిముబ్బడిగా రేషన్ కార్డులు మంజూరు చేసింది. వాటి సంఖ్య 1.45 కోట్లకు పెరిగింది. కానీ కేంద్రం మాత్రం తాను గుర్తించిన 80 లక్షల కార్డులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి నగదు చెల్లింపులు చేస్తోంది. అంటే మిగతా 45 లక్షల కార్డులకు ఉచిత బియ్యం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిపై పడింది. ఇది ఆర్థిక భారంగా పరిణమించింది. అటు 80 లక్షల కార్డుదారులకే ఉచిత బియ్యం పంపిణీచేస్తే.. మిగతా కార్డుదారుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. దీనికితోడు రాష్ట్రంలో నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఈ విషయంలో ఎటు వెళ్లాలో తెలియక మొత్తం ఉచిత రేషన్ పంపిణీని నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 80 లక్షల కార్డుదారులకు అన్యాయం చేస్తున్నారు.
నాడు తెగ హడావుడి..
కొవిడ్ సమయంలో ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నప్పుడు బీజేపీ నేతలు తెగ హడావుడి చేశారు. రేషన్ డిపోల వద్దకు వెళ్లి ఇది ప్రధాని మోదీ అందిస్తున్న బియ్యంగా చెప్పుకొచ్చారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ పాత్రే లేదని తేల్చారు. ఏకంగా రేషన్ డిపోలు, బియ్యం తరలించే లారీలకు మొదీ బొమ్మలతో కూడిన ఫ్లెక్సీలను వేలాడదీశారు. కానీ గత మూడు నెలలుగా ఉచిత రేషన్ పంపిణీ నిలిచిపోయినా బీజేపీ నేతలు కిమ్మనడం లేదు. పేదల బియ్యం కంటే ప్రజా సమస్య ఏమి ఉంటుంది. అయినదానికి కానిదానికి హడావుడి చేసే బదులు పేదల బియ్యం కోసం పోరాడలేరా? అన్న ప్రశ్న అయితే ప్రజల నుంచి వినిపిస్తోంది. కనీసం దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి అందించిన వారు లేరు. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసే నాయకులు రెండు నెలలుగా బియ్యం పంపిణీ చేయకపోయినా సమాచారం అందించలేదా? లేకుంటే కేంద్ర ప్రభుత్వమే మిన్నకుండా ఉందా? అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికైనా పేదల బియ్యం పంపిణీ విషయంలో జరుగుతున్న జాప్యం, అన్యాయంపై బీజేపీ నేతలు నోరు మెదపాలన్న డిమాండ్ అందరి నోట వస్తోంది.
Also Read:Abortion Law in US: గర్భస్రావ చట్టంలో మార్పులు అమెరికాకు ఇప్పుడు భారత్ ఆశాదీపం
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Free ration rice distribution is not happening in ap bjp leaders ignored
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com