CM Chandrababu: తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నారా? తమ సమస్యలను విన్నవించునున్నారా? తాజాగా ఎదురైన సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. తీవ్ర రూపం దాల్చి తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.దీనిపై అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అప్పటినుంచి చిత్ర పరిశ్రమలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇకముందు తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలు అనుమతులు ఇవ్వడం లేదని నిండు సభలో రేవంత్ ప్రకటించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతగానో ఆందోళన చెందుతోంది. తెలంగాణపై ఆశలు వదులుకుంటుంది. అక్కడ జరిగే నష్టాన్ని సంక్రాంతిలో ఏపీలో భర్తీ చేసుకునేందుకు డిసైడ్ అయ్యింది.
* సీఎం అప్పాయింట్మెంట్ కోసం..
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, ఇంకోవైపు బెనిఫిట్ / ప్రీమియర్ షో లను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం, టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చే అవకాశం లేకపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఆందోళనతో ఉన్నారు. పైగా ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇటువంటి తరుణంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి సంక్షోభం ఎదురైంది. అందుకే దీనికి పరిష్కార మార్గం కోసం చిత్ర పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉండడంతో ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు వారు సిద్ధపడుతున్నట్లు సమాచారం. సీఎం అపాయింట్మెంట్ కుదిరిన వెంటనే చంద్రబాబును వారు కలిసే అవకాశం ఉంది.
* ఆ రెండు చిత్రాల కోసమైనా
తెలంగాణ సీఎం రేవంత్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. పైగా చిత్ర పరిశ్రమ సమస్య రెండు రాష్ట్రాలతో కూడుకున్నది. అందుకే వీలైనంతవరకు ఈ విషయంలో చంద్రబాబు చొరవ చూపితే పరిష్కార మార్గం దొరుకుతుందని సినీ పెద్దలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి రావాలని సినీ పరిశ్రమ కోరుకుంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఈ తరుణంలో చంద్రబాబు కలుగ చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని సినీ పరిశ్రమ భావిస్తోంది. పైగా ఈ సంక్రాంతికి 500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గేమ్ చేజర్ సినిమా రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. మరోవైపు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సైతం జనవరి 12న విడుదల కానుంది. మెగా, నందమూరి కుటుంబాలకు సంబంధించిన సినిమాలు కావడంతో చంద్రబాబు సైతం తప్పకుండా కలుగజేసుకుంటారని సినీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా చంద్రబాబును కలిసి ఈ సమస్యకు చెక్ చెప్పాలని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Tollywood in crisis will chandrababu be a game changer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com