Ramadan 2023 Moon Sight : ముస్లింలకు అత్యంతపవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. గురువారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కన్పించడంతో మత పెద్దలు అధికారికంగా రంజాన్ ప్రారంభమైనట్టు ప్రకటించారు. ఈ నెలలో ముస్లింలు కఠిన ఉపవాసం పాటిస్తారు. విశ్వాసులైన మానవులపై తన కారుణ్య వర్షాన్ని కురిపించేందుకు రంజాన్ మాసం వస్తుందని ఖురాన్ పేర్కొంటోంది. రజబ్, షాబాన్ నెలవంకలను చూస్తూ ‘‘ఓ అల్లాహ్! మమ్మల్ని రంజాన్ మాసం వరకూ చేర్చు అని దైవ ప్రవక్త మహమ్మద్ ప్రార్థించేవారని ముస్లింల నమ్మిక. ‘‘ఒక శుభప్రదమైన నెల రాబోతోంది. ఉపవాసాలను (రోజాలను) అల్లాహ్ మీకు విధిగా చేశా డు. రంజాన్ మాసంలో స్వర్గ ద్వారాలు తెలుసుకుంటాయి. నరక ద్వారాలు మూసుకుంటాయి. సైతాన్లు సంకెళ్ళతో బంధితులవుతారు. వెయ్యి నెలల కన్నా శ్రేష్టమైన రాత్రి ఒకటి ఈ మాసంలోనే ఉంది’’ అని ఆయన ప్రకటించారు.. విశ్వాసంతో కూడిన ఉత్సాహంతో రంజాన్‌కు స్వాగతం చెప్పేవారు ఎంతో అదృష్టవంతులు. ఆరాధనలకు అతి ముఖ్యమైన మాసం ఇది. ఒకసారి షాబాన్ నెల చివరి రోజున దైవ ప్రవక్త ప్రసంగిస్తూ ‘‘విశ్వాసులారా! ఈ నెలలో ఎవరైనా ఒక సత్కార్యం చేసినట్టయితే… ఇతర మాసాల్లో చేసిన 70 సత్కార్యాలకు అది సమానం’’ అని చెప్పారు. అత్యంత అనుగ్రహశీలి అయిన ఆయన రంజాన్ నెలలో మరిన్ని రెట్లు ప్రసన్నుడిగా మారేవారు.
భక్తి ప్రపత్తులతో స్వాగతించాలి
రంజాన్ మాసాన్ని భక్తి ప్రపత్తులతో స్వాగతించాలి. రోజా, దివ్య ఖుర్‌ఆన్ పారాయణ, రాత్రి సమయాల్లో తరావీహ్ నమాజ్, జకాత్, ఫిత్రా దానాలు, తాఖ్ రాత్రులు (బేసి రాత్రులు), లైలతుల్ ఖద్ర్, ఏతేకాఫ్ లాంటి ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాటిని గట్టి పట్టుదలతో ఆచరిస్తామని సంకల్పం చేసుకోవాలి. అంతిమ పవిత్రగ్రంథమైన దివ్య ఖుర్‌ఆన్ అవతరించిన మాసం ఇది. మానవులందరికీ ఇది మార్గదర్శకమనీ, ఋజుమార్గం చూపించే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయనీ ఆ గ్రంథంలో అల్లాహ్ పేర్కొన్నారు. రంజాన్ మాసంలో వీలైనన్ని ఎక్కువసార్లు, కనీసం ఒక్కసారైనా దివ్య ఖుర్‌ఆన్ చదివే ప్రయత్నం చెయ్యాలి.
జకాత్‌గా చెల్లించాల్సి ఉంటుంది
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమించే ఇఫ్తార్‌ను మహా ప్రవక్త అధికంగా ప్రోత్సహించేవారు. అధికులు, అధములు అనే భేదాన్ని తొలగించడానికి ‘జకాత్’ అనే వ్యవస్థ ఇస్లామ్ ఏర్పాటు చేసింది. ప్రతి విశ్వాసి తన వద్ద మిగిలి ఉన్న సంపదలో… ఏటా రెండున్నర శాతాన్ని జకాత్‌గా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రంజాన్ మాసంలోనే జకాత్‌లు చెల్లిస్తూ ఉంటారు. ఇక రంజాన్ ఉపవాసాలు పూర్తి చేసిన సందర్భంగా… పేదలకు ఇవ్వవలసిన తప్పనిసరి దానం… ఫిత్రా. పండుగకు ముందే పేదలకు ఫిత్రా దానం చెయ్యాలని మహా ప్రవక్త సూచించారు. రంజాన్ మాసంలో శుభాలను అందరూ పొందాలని కోరుకుంటూ… నియమాలను నిష్టగా పాటించాలి.