Varalakshmi Vratham 2023: సంపదలు సమకూరాలంటే.. ఇల్లు సంతోషంగా ఉండాలంటే.. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలంటారు. ఇందులో భాగంగా ప్రతీ శుక్రవారం అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అయితే ప్రతీ శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్లపక్షం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవడం వల్ల ఏడాదిపాటు చేసిన పుణ్యం లభిస్తుందని అంటారు. అందుకే చాలా మంది మహిళా భక్తులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? ఎవరు ప్రారంభించారు? అనేది తెలుసుకుందాం..
వరలక్ష్మీ వ్రతం ప్రారంభంపై చాలా కథనాలు ఉన్నాయి. వీటిలో ముందుగా శివుడు భస్మ సింహాసనంపై కూర్చున్న సమయంలో నారద మహర్షితో సహా దేవతలంతా పరమేశ్వరుడిని కొలుస్తారు. ఈ సమయంలో పార్వతి దేవి శివుడిని ఉద్దేశించి మహిళలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా, సంతోషంగా ఉండాలేంటే ఏ వ్రతం చేయాలో అడుగుతుంది. దీంతో శివుడు సకల శుభాలు కలిగించే వ్రతం ఉందని, అదే వరలక్ష్మీ వ్రతం అని చెబుతాడు. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో రెండో శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలని చెబుతాడు. అప్పటి నుంచే వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారని అంటున్నారు.
అయితే మరో కథనం ప్రాచుర్యంలో ఉంది. మగథ దేశంలో కుడినము అనే పట్టణం ఉండేది. ఇక్కడ బంగారు గోడలను నిర్మించారు. ఈ పట్టణంలో చారమతి అనే స్త్రీ ఉండేది. ఆమె ఎంతో గుణవంతురాలు. ప్రతీ రోజు ఉదయం లేచి భర్త పాదాలకు నమస్కరిస్తూ ఇంట్లో పనులు చేసుకునేది. అత్తమామలను సేవిస్తూ ఉండేది. అయితే ఒకరోజు చారుమతి కలలో వరలక్ష్మీ దేవి కలలో కనిపించి.. శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించు.. నీవు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.. అని చెబుతుంది.
అప్పటి నుంచి చారుమతి శ్రావణ శుక్రవారం రోజున ఇరుగుపొరుగ ముత్తైదువులను పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి షోడశోపచారాలతో అమ్మవారిని పూజిస్తుంది. అయితే చారుమతి ఇంటికి వచ్చిన వారి ఇళ్లల్లో సకల సంపదలు పెరుగుతాయి. దీంతో అమ్మవారిని అనుగ్రహాన్ని గుర్తించిన వారు అప్పటి నుంచి వరలక్ష్మీ వ్రతాన్ని తమ ఇళ్లల్లోనూ చేసుకోవడం ప్రారంభించారు. అలా అప్పటి నుంచి వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తున్నారు. తిథులతో సంబంధం లేకుండా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వత్రం చేయాలని పండితులు చెబుతున్నారు.