Homeఎంటర్టైన్మెంట్Puri Jagannath: మీతో మిమ్మల్ని కూర్చోబెడతారు.. పూరి కొత్త పాఠం !

Puri Jagannath: మీతో మిమ్మల్ని కూర్చోబెడతారు.. పూరి కొత్త పాఠం !

Puri Jagannath:  ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా అద్భుతమే, కొత్త జనరేషన్ కు ఆ మాటలే గొప్ప పాఠాలు. అందుకే ‘పూరీ మ్యూజింగ్స్’కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్ర‌పంచంలోని వింత‌లను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘విపశ్యన’.
దీని గురించి పూరి మాటల్లోనే..

పూరి మాట్లాడుతూ… ‘విపశ్యన అనేది పురాతన ధ్యాన పద్ధతి. దాదాపు 2500 ఏళ్ల క్రితం బుద్ధ భగవానుడు దీన్ని కనిపెట్టారు. మనకు చాలా విపశ్యన కేంద్రాలు ఉన్నాయి. పచ్చని చెట్లతో ఒక పాజిటివ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తో అవి ఉంటాయి. అలాగే అవి ఎత్తైన గోడలతో కనిపిస్తాయి. విపశ్యన రెండు రకాలుగా ఉంటుంది. ఏకాగ్రత. మనః పరిశీలన. విపశ్యన సమయంలో మిమ్మల్ని ఒక సమయంలో కూర్చోబెట్టి, శ్వాసమీద ధ్యాస పెట్టమని చెబుతారు.

Also Read:  పీకే ఎంట్రీకి ముందే మొదలు పెట్టేశారా?

ఇక ఇది పదిరోజుల కోర్సుగా ఉంటుంది. మీ దగ్గర మొబైల్స్‌, పుస్తకాలు ఏవి ఉన్నా తీసుకుంటారు. ఆ క్షణం నుంచి మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. అక్కడ ఎంతమంది ఉన్నా, వాళ్లతో సైగల ద్వారానే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది అతి పురాతన బౌద్ధ ధ్యాన ప్రక్రియ. ఎవరి గది వాళ్లకు ఇస్తారు. అందులో టీవీ ఉండదు. ఉదయం 4గంటలకు నిద్రలేపుతారు. 4.30 నుంచి 6.30 వరకూ మెడిటేషన్‌ చేయమంటారు. అల్పాహారం తీసుకోగానే, మళ్లీ మధ్యాహ్నం వరకూ మెడిటేషన్‌ చేయిస్తారు. ప్రతి గంటకూ ఒక తరగతి ఉంటుంది. గదిలో స్పీకర్లు ఉంటాయి. అందులో నుంచి వచ్చే సూచనలు పాటిస్తూ, వాళ్లు చెప్పింది చేయడమే. చక్కటి వెజిటేరియన్‌ ఆహారం పెట్టి, రాత్రి 9.30గంటలకు లైట్లు ఆర్పేస్తారు.

రోజుకు 10గంటలు మెడిటేషన్‌. మొదటి రెండు రోజులు మెంటల్‌ వస్తుంది. చొక్కాలు చింపుకొంటారు. పారిపోవాలని చూస్తారు. గేట్లు లాక్‌ చేసి ఉంటాయి. గోడదూకి పారిపోవాలని చూస్తుంటారు. అందుకే అక్కడ అంత ఎత్తైన గోడలు కడతారు. కొంతమంది తలుపులు తీయమని అరుస్తారు. అయినా వాళ్లు వినరు. ‘సైలెన్స్‌’ అని చీటీ మీద రాసి చూపిస్తారు. మీకు జైల్లో పెట్టినట్లు ఉంటుంది. కానీ, మూడో రోజు నుంచి మీకు మెల్లగా అలవాటైపోతుంది. ఆ తర్వాత మెడిటేషన్‌లో కూర్చొంటే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే కాదు, మీ ఒంట్లో నరనరాల్లో ప్రవహించే రక్తం శబ్దం కూడా వినిపిస్తుంది. మాట్లాడటం మానేస్తే, ఎన్ని దరిద్రాలు తగ్గుతాయో మీకు అర్థమవుతుంది. మీలో డిప్రెషన్‌, యాంగ్జైటీ తగ్గుతుంది. ప్రశాంతత అలవాటవుతుంది. అదో అద్భుతమైన అనుభూతి. పది రోజుల తర్వాత మీ వస్తువులు, బట్టలు మీకు ఇచ్చేస్తూ అక్కడ ఉన్న టీచర్‌ మీకు థ్యాంక్స్‌ చెబుతారు.

ఎన్నో రోజుల తర్వాత మీరు విన్న మొదటి మాట అది. ఆ మాట విన్న తర్వాత కృతజ్ఞతాభావంతో మీ కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. ఇంతకుముందులా బయట ట్రాఫిక్‌ శబ్దాలు వింటే మీకు నచ్చదు. ఇన్నాళ్లూ ఎంత శబ్ద కాలుష్యంలో బతుకుతున్నామో అర్థమవుతుంది. ఆ రోజు నుంచి అనవసరంగా ఏమీ మాట్లాడరు. అవసరమైందే మాట్లాడతారు. ఒక దైవత్వం ఫీలవుతారు. ఇంటికి వచ్చాక రోజుకు గంటసేపైనా మెడిటేషన్‌ చేయాలనిపిస్తుంది. ఆ గంట కాస్తా అరగంట అవుతుంది. చివరకు ఆ అరగంట కూడా మాయమైపోతుంది. ఆ తర్వాత విపశ్యన గుర్తుండదు.. బుద్ధుడు గుర్తు ఉండడు. అన్నీ మర్చిపోతారు. జన జీవన స్రవంతిలో కలిసిపోతారు. మనలాంటి ఈ మామూలు మనుషులకు విపశ్యన పెట్టారు. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ సెంటర్లు నడుపుతున్నారు. వాళ్లు ఫీజు తీసుకోరు. పది రోజుల కోర్సు పూర్తయిన తర్వాత మీకు ఎంత తోస్తే అంత ఇవ్వవచ్చు. మీరు ఇవ్వకపోయినా, ఇవ్వలేకపోయినా వాళ్లు ఏమీ అనుకోరు. పది రోజుల కోర్సు చేయడమే మీకు అంత కష్టంగా ఉంటే, జీవితాంతం అక్కడే ఉండి పనిచేసే టీచర్లు, స్టాఫ్‌కు చేతులెత్తి మొక్కాలి. అక్కడ ఎంతో మంది జీతం లేకుండా పనిచేస్తుంటారు. వాళ్లు నిజమైన సాధువులు. విపశ్యన అనేది మత కేంద్రం కాదు. వాళ్లేమీ బోధించరు. మీతో మిమ్మల్ని కూర్చోబెడతారు’’ అని పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు.

Also Read: పల్నాడులో పావులుగా మారుతున్న పోలీసులు.. రాజ‌కీయ ర‌చ్చ‌..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular