Gangavva: మై విలేజ్‌షో గంగవ్వకు ఊహించని అవార్డు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళలకు ఏటా అవార్డులు ప్రకటిస్తోంది. 2020లో ప్రకటించిన అవార్డుకు మై విలేజ్‌ షో గంగవ్వ ఎంపికైంది.

Written By: Raj Shekar, Updated On : March 18, 2024 9:00 am

Gangavva

Follow us on

Gangavva: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు వివిధ సంస్థలు అవార్డులు ప్రదానం చేస్తున్నాయి. తాజాగా మైవిలేజ్‌ షో గంగవ్వకు సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్, ముందడుగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎంపవర్డ్‌ ఉమెన్‌ – 2024 అవార్డు ప్రధానం చేసింది. నేటి తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్న తెలంగాణకు చెందిన 50 మంది మహిళలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇందులో మై విలేజ్‌ షో గంగవ్వ, జర్నలిస్ట్‌ హేమ తదితరులను అవార్డు వరించింది. ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసి తన కాళ్లపై తాను నిలబడిన గంగవ్వను వక్తలు కొనియాడారు.

గతంలో స్త్రీశక్తి అవార్డు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళలకు ఏటా అవార్డులు ప్రకటిస్తోంది. 2020లో ప్రకటించిన అవార్డుకు మై విలేజ్‌ షో గంగవ్వ ఎంపికైంది. ఆ ఏడాది 20 రంగాలకు చెందిన 30 మంది మహిళలకు అవార్డులు ప్రకటించింది. జానపద కళారంగంలో మంగ్లీ సత్యవతి, సోషల్‌ మీడియాలో మిల్కూరి గంగవ్వ, వ్యవసాయరంగంలో బెగారి లక్ష్మమ్మ, జర్నలిజంలో జీ నిర్మలారెడ్డితోపాటు పలువురు అవార్డు అందుకున్నారు.

గంగవ్వ టాలెంట్‌ కు ఫిదా..
ఆరు పదుల వయసులో యూట్యూబ్‌ సంచలనంగా మారింది గంగవ్వ. ఆమెగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ భాష, యాస, అమాయకమైన చూపులు, లోకల్‌ పంచ్‌లతో ప్రజల మనసులు గెలుచుకుంది గంగవ్వ. మై విలేజ్‌ షో యూట్యూబ్‌ ఛానెల్‌లో గంగవ్వ పాత్రలో ఆమె నటన అద్భుతం. పల్లెటూరి సంస్కృతిని చాటిచెబుతూ ప్రజాదరణ పొందడంతో సినిమాల్లోనూ గంగవ్వకు అవకాశం దక్కింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్‌ శంకర్, మల్లేశం, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్‌ స్టోరీతోపాటు పలు చిత్రాల్లో నటించిన గంగవ్వ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జగిత్యాల జిల్లా నుంచి..
ఇక గంగవ్వ స్వగ్రామం జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి. భర్త వదిలేసి వెళ్లినా ధైర్యంగా తన ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్దచేసి పెళ్లి చేసింది. తర్వాత తన టాలెంట్‌ ద్వారా యూట్యూబ్‌ ఛానెల్‌లో షోలు చేసింది. ఆమె టాలెంట్‌కు ప్రజలు ఫిదా అయ్యారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో కూడా గంగవ్వకు అవకాశం దక్కింది. అయితే మధ్యలోనే ఆమె డ్రాప్‌ అయ్యారు. అయినా మంచి రెమ్యునరేషన్‌ దక్కించుంది. తర్వాత సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడింది.