టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటిన్యూ అవుతుంది. ఖుషీ లాంటి హిట్ తర్వాత సక్సెస్ చూడడానికి ఆయనకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన జల్సాతో హిట్ కొట్టారు పవన్. ఆ హిట్ తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
ఆ తర్వాత మళ్లీ వరుస ఫెయిల్యూర్స్ వెంటాడాయి. దేవుడా ఒక్క హిట్టు అంటూ అభిమానులు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఈ సారి విజయం అందుకోవడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు పవర్ స్టార్. ఈ సినిమా చూసి ఆనందంతో ఏడ్చేసిన అభిమానులు ఎందరో! ఆ వెంటనే అత్తారింటికి దారేది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి. చివరగా రాజకీయాల్లోకి వెళ్లే సమయంలో వచ్చిన అజ్ఞాత వాసి భారీ డిజాస్టర్ గా నిలిచింది. అటుతర్వాత మూడేళ్లు గ్యాప్. ఇక పవన్ సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదని అభిమానులు నిరాశలో కూరుకుపోయిన సమయంలో రీ-ఎంట్రీని అనౌన్స్ చేశాడు పవర్ స్టార్.
మరి, ఇంత కాలం తర్వాత వకీల్ సాబ్ వస్తోంది. ఇటు పవన్ తోపాటు అటు ఫ్యాన్స్ కు సైతం ఈ సినిమా హిట్ ఎంతో అవసరం. ఈ మూవీ సక్సెస్ ద్వారా పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలి పవన్ చూస్తుండగా.. చాలా కాలం తర్వాత వస్తున్న తమ హీరోమూవీ హిట్ కొట్టాల్సిందేనని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి.. జల్సా, గబ్బర్ సింగ్ మాదిరిగా బ్లాక్ బస్టర్ గా నిలిచి హిస్టరీ రిపీట్ చేస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటు దర్శకుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని టాక్. గబ్బర్ సింగ్ రీమేక్ సందర్భంగా కూడా హరీశ్ శంకర్ ఇదేవిధంగా ఉన్నాడు. ఈ సినిమా నుంచి బయటకు వస్తున్నప్పుడు విందు భోజనం లాంటి సినిమాను ఆరగించి భుక్తాయాసంతో బయటకు వస్తారు ఫ్యాన్స్ అన్నాడు. అన్నట్టుగానే అదే జరిగింది. ఇప్పుడు శ్రీరామ్ వేణు కూడా తాను చేసిన మార్పుల పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడట. మరి, ఏం జరుగుతుంది? చరిత్ర పునరావృతం అవుతుందా? లేదా? అన్నది చూడాలి.