Thalapathy Vijay: రాజకీయాలలో నాయకులందరూ హామీలు ఇస్తుంటారు. అందరి సమక్షంలో గొప్ప గొప్ప మాటలు చెబుతుంటారు. కానీ వీటి మీద నిలబడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇక చిత్ర సీమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా మొదట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పారు. ఆ మాటలు మీద నిలబడిన వారు దాదాపు లేరని చెప్పుకోవాలి.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ రాజకీయాలలో స్థిరంగా నిలబడిన వారు కొంతమంది మాత్రమే. అంతటి మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు మళ్ళీ సినిమాలు చేయనని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆయన మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ కూడా అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలు చేయబోనని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వకీల్ సాబ్, బ్రో, భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, ఓజి ఇలా ఐదు సినిమాలలో ఆయన నటించారు. చిరంజీవి కూడా ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, ఆచార్య, బోలా శంకర్ వంటి సినిమాలలో నటించారు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు.. అనే సినిమాలో నటిస్తున్నారు.
తమిళ చిత్ర పరిశ్రమలో కూడా రాజకీయాల్లోకి వచ్చిన వారు.. వస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇటీవల విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.. అంతేకాదు తాను నటిస్తున్న జననాయగన్ సినిమా చివరిదని ప్రకటించారు. ఆయన చేసిన ఆ ప్రకటన అభిమానులను ఆవేదనకు గురిచేస్తుంది. కెరియర్ పీక్లో ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల తమిళ్ చిత్ర పరిశ్రమలో చర్చ మొదలైంది. విజయ్ రాజకీయాల్లో ఉండాలని.. అదే సమయంలో సినిమాల్లో కూడా నటించాలని అభిమానులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం తమిళ్ రాజకీయ పరిస్థితులను చూస్తే విజయ్ కోరుకున్నట్టుగానే ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తమిళ రాజకీయాలలో బలమైన ప్రతిపక్షం ఇప్పుడు లేదు. ఒకవేళ ఆ స్థానాన్ని విజయ్ ఆక్రమిస్తే అప్పుడు ఆయన సినిమాల్లో నటించే అవకాశం ఉండదు. ఒకవేళ అధికారాన్ని గనుక దక్కించుకుంటే అప్పుడు ఆ మాత్రం తీరిక కూడా ఆయనకు ఉండదు. ఒకవేళ ప్రతిపక్షానికి దూరమై.. మామూలు పార్టీగానే మిగిలిపోతే అప్పుడు.. సినిమాల్లోకి కచ్చితంగా రావాల్సి ఉంటుంది. అప్పుడు విజయ్ తన మాటను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒక రకంగా ఆయన అభిమానులకు మంచి వార్త అయినప్పటికీ.. మిగతా వారికి మాత్రం కచ్చితంగా ఆయుధం అవుతుంది.