Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన లవ్, మాస్,యాక్షన్, ఫ్యామిలీ వంటి విభిన్నమైన జానర్స్ లో సినిమాలు చేసాడు కానీ, పీరియాడిక్ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా తియ్యలేదు. అసలు పవన్ కళ్యాణ్ అలాంటి లుక్స్ కి సెట్ అవుతాడా అని అందరూ అనుకునే వారు. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో ఆయన లుక్స్ ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ పీరియడ్ జానర్ కి కూడా సరిపోతాడు, ఆయనతో మహాభారతం లో ఎదో ఒక్క పాత్ర వేయించొచ్చు అని కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు గ్లిమ్స్ వీడియోలు, ఒక టీజర్ విడుదల కాగా వాటికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూసారు.
కానీ కరోనా కారణంగా ఈ చిత్రం చాలా కాలం వరకు ఆగిపోయింది. కరోనా పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టి ‘భీమ్లా నాయక్’, ‘బ్రో ది అవతార్’ వంటి సినిమాలు చేసాడు. మధ్యలో 40 రోజులు రామోజీ ఫిలిం సిటీ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ని షూట్ చేసారు, ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ జరగలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, డేట్స్ కేటాయించకపోవడం వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ కి డేట్స్ కేటాయించాడు పవన్ కళ్యాణ్. ఈ నెల 23 వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ లో ఆయన మీద భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ పోరాట సన్నివేశానికి ప్రముఖ హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నిక్ పోవెల్ దర్శకత్వం వహించబోతున్నాడు. హాలీవుడ్ లో ఎన్నో యాక్షన్ సినిమాలకు ఈయన స్టంట్ మాస్టర్ గా వ్యవహరించాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 20 రోజుల డేట్స్ మాత్రమే అవసరం ఉంది. ఒక భారీ ఫైట్ సన్నివేశం తో పాటు, పార్ట్ 2 కి లీడింగ్ ఇచ్చే సన్నివేశాలను ఈ 20 రోజుల్లో షూట్ చేయబోతున్నారు. మరోపక్క ఈ సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ బాగా ఆలస్యం అవ్వడం, ఆయనకీ అవకాశాలు తప్పుకునే ప్రమాదం ఉండడం తో ఆయన ఇక నేను చేయలేనని నిర్మాత AM రత్నం కి చెప్పాడట. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, దర్శకత్వ పర్యవేక్షణ కచ్చితంగా చేస్తానని క్రిష్ మాట ఇచ్చాడట. మిగిలిన భాగానికి దర్శకత్వం జ్యోతి కృష్ణ చేయబోతున్నాడు. ఈయన గతం లో ఆక్సిజన్, రూల్స్ రంజన్ వంటి సినిమాలు తీసాడు.