i-bomma-Tamil Rockers-Movierulez: సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు నిర్మాతలకు కోటాను కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది. సినిమా హిట్ కాకపోయినా పెట్టుబడికి మాత్రం ఢోకా ఉండేది కాదు. కానీ మారిన పరిస్థితులు నిర్మాతను నష్టాల్లోకి తీసుకెళ్తున్నాయి. కరోనా మధ్య తరగతి జీవితాలను మార్చినట్లే.. సినిమా ఇండస్ట్రీని కుదేలు చేసింది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నా.. నిర్మాతలకు పెద్దగా లాభాలు ఉండడం లేదు. కారణం ఓటీటీ ప్లాట్‌ఫాంలు, ఇల్లీగల్ వెబ్‌సైట్స్.. ఇక సినీ వ్యయం పెరగడం.. రిలీజ్ చేస్తే డబ్బులు తిరిగిరాకపోవడం.. అందుకే నిర్మాతలు ప్రస్తుతం షూటింగ్ లు బంద్ పెట్టి దీనిపై నిరసన తెలుపుతున్నారు. సినీ సమస్యలకు తోడు ఆన్ లైన్ లో కాపీ సినీ వెబ్సైట్లు సినిమా రిలీజ్ కాగానే దొంగచాటుగా తీసి విడుదల చేస్తుండడంతో వాటిని చూసి జనాలు థియేటర్లకు రావడం లేదు. దీంతో నిర్మాతలకు కోట్ల నష్టం వాటిల్లుతోంది. అసలు ఈ సినీ కాపీ వెబ్ సైట్స్ పై ప్రభుత్వం ఎన్ని సార్లు నిషేధించినా అవి కొత్తకొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అసలు వీటిని ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది? వీటికి ఆదాయం ఎలా వస్తుందన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-ఓటీటీతో తీవ్ర ప్రభావం..
కరోనా లాక్‌డౌన్ కాలంలో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు ఫస్ట్, సెకండ్ లాక్‌డౌన్‌ల కలిపి ఆరు నెలలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకురాలేదు. ఈ సమయంలో ఇళ్లలో బోర్ కొట్టకుండా ఉండేందుకు ఓటీటీ ప్లాట్‌ఫాంలను ఆశ్రయించారు. అవి మంచి కంటెంట్ తో ప్రేక్షకుడిని కట్టిపడేయడంతో వాటికే బానిస అయిపోయారు. థియేటర్లకు రావడం మానేశారు. ఇక ఓటీటీల్లో చూడాలంటే డబ్బులు పెట్టాలి. ఆ డబ్బులు చెల్లించని వారికి ఈ కాపీ వెబ్ సైట్స్ వరంలా మారాయి. ఎందుకంటే ఇందులో ఉచితంగా చూడొచ్చు. ఓటీటీలో అలా కొత్త సినిమా విడుదల కాగానే దాన్ని కాపీ చేసి కొంతమంది ఇల్లీగల్ వెబ్‌సైట్ ప్రారంభించి ప్రేక్షకుడికి ఉచితంగా చూసే, డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీంతో ఇంట్లోనే సగటు ప్రేక్షకుడికి వినోదం పంచే సౌకర్యం కల్పించారు.. ఈ కారణంగా ప్రేక్షకుడు థియేటర్ కు రావడం మానేశాడు. అది నిర్మాతలకు కోట్లు నష్టం చేకూరుస్తోంది.
-ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు…
కరోనా సమయంలో సినిమా, సీరియల్ షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో కొంత మంది వెబ్‌సిరీస్ షూటింగ్స్ ప్రారంభించారు. వీటిని ఓటీటీల్లో విడుదల చేయడం ద్వారా అటు ఓటీటీ యాజమాన్యాలకు, ఇటు వెబ్ సిరీస్ తీసిన వారికి ఆదాయం మార్గంగా మారింది. ఇదే సమయంలో కొంతమంది సినిమా వాళ్లు కూడా వెబ్‌సిరీస్ ను ప్రొడ్యూస్ చేయడం ప్రారంభించారు. సినిమా లను కూడా ఓటీటీలో విడుదల చేసే స్థాయికి అతి తక్కువ కాలంలో ఓటీటీలు పుంజుకున్నాయి. ఓటీటీల్లో రిలీజ్ కాగానే దాన్ని అక్రమంగా డౌన్ లోడ్ చేసి ఈ కాపీ వెబ్ సైట్స్ జనాలకు ఉచితంగా పంచేస్తున్నాయి. మధ్యలో యాడ్స్ పెట్టి కోట్లు సంపాదిస్తున్నాయి.
Also Read: BJP Secret Surveys: బీజేపీ రహస్య సర్వేల వెనుక అసలు కారణాలేంటి?
-ఇల్లీగల్ జోరు…
సినిమాలు, ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్‌లను ఐ-బొమ్మ, తమిళ్ రాకర్స్, మూవీరూల్జ్ లాంటి కొన్ని ఇల్లీగల్ వెబ్‌సైట్స్ క్యాష్ చేసుకోవం ప్రారంభించాయి. సినిమాలను, ఓటీటీ సిరీస్‌లను అక్రమంగా డౌన్‌లోడ్ చేసుకుని, థియేటర్లలో మినీ కెమెరాల ద్వారా వీడియో తీసి వాటిని వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేసి ఉచితంగా ప్రేక్షకులకు చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వెబ్‌సైట్‌లు అతి తక్కువ వ్యవధిలో జనంలోకి వెళ్లాయి. దీంతో యాడ్స్ కూడా ఆ వెబ్‌సైట్‌లు భారీగానే వస్తోంది. అదే వారికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. వెబ్‌సైట్ యాజమాన్యాలకు కూడా సొమ్ములు దండిగా వస్తుండడంతో కొత్త సినిమాలన్నింటిని పైరసీ చేసేసి వెబ్ సైట్లలో పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూడడం తప్ప వీటిని అరికట్టలేకపోతున్నాయి.
-నిషేధించడం అసాధ్యం..
ఇల్లీగల్ వెబ్‌సైట్‌లను నిషేధించడం అటు గూగుల్‌కు గానీ, ఇటు గవర్నమెంట్‌కు గానీ సాధ్యం కావడం లేదు. ఇల్లీగల్ వెబ్‌సైట్ నడిపేవారు తమకు సైట్ నేమ్ మార్చకుండా డొమైన్‌ను మారుస్తున్నారు. దీంతో గూగుల్‌కు గానీ, గవర్నమెంట్‌కు గానీ చిక్కడం లేదు. దీంతో వారు ఆడిందే ఆటగా సాగుతోంది. నిర్మాతలు కోట్ల పెట్టి తీసిన సినిమాను ఇష్టానుసారంగా తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో నిర్మాతలు నష్టాలపాలవున్నారు. అయితే ఇది ఎల్లకాలం సాగదు. ఇప్పటికే ఓటీటీల ప్రభావం సినిమా ఇండస్ట్రీపై తీవ్రంగా ఉంది. దీనికి తోడు ఇల్లీగల్ వెబ్‌సైట్లు ఇండస్ట్రీని మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతలు ఓటీటీ ఆధిపత్యానికి చెక్‌పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా ఇల్లీగల్ వెబ్‌పైట్ల నిషేధానికి కూడా చర్యలు తీసుకుంటే సినిమారంగం మల్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది.