
కరోనాతో ఎప్పుడో ఆరు నెలల క్రితమే సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇటీవలే షూటింగ్‌లకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలు.. థియేటర్ల ఓపెన్‌కు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో తాము తీసిన సినిమాలను ఎలాగైనా విడుదల చేయాలని సంకల్పంతో ఉన్నారు నిర్మాతలు, డైరెక్టర్లు. ఇందుకు ఓటీటీని ప్లాట్‌ఫాంగా ఎంచుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ అంతా ఓటీటీదే నడుస్తోంది. ఓటీటీ వేదికగానే సినిమాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
అయితే.. ది ఫ్యామిలీ మ్యాన్, స్పెషల్ ఆప్స్ లాంటి సిరీస్‌లను హిందీలో భారీ బడ్జెట్‌తో సినిమా రేంజ్‌లోనే తీశారు. ఆ స్థాయి క్వాలిటీ కోసం అనురాగ్ కశ్యప్‌లాంటి ప్రముఖ దర్శకులు పనిచేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే వెబ్ సిరీస్‌లలో క్వాలిటీ తీసుకొస్తున్నారు. సినిమాలను తలపించేలా వెబ్ సిరీస్‌లను రూపొందిస్తున్నారు.
ఓటీటీకి పెరుగుతున్న క్రేజ్‌తో బాలీవుడ్ లాగే.. తెలుగులో కూడా వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. కానీ.. క్వాలిటీ కోసం సినిమా స్థాయి బడ్జెట్ పెట్టక తప్పదు. కానీ అంత పెట్టుబడి పెడితే కనీసం పెట్టుబడి అయినా రావడం అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. కామన్‌గా హిందీ సిరీస్‌లకు దేశమంతటా ఆడియన్స్ ఉంటారు. వాటికి ఉన్న రీచ్ వల్ల ఎంత ఖర్చు పెట్టినా ఓటీటీలకు వర్కవుట్ అవుతోంది. కానీ రీజనల్ వెబ్ సిరీస్‌లకు ఆదరణ చాలా తక్కువ.
లాక్‌డౌన్ టైమ్‌లో పలువురు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపారు. ఇకపై థియేటర్లకు ఓటీటీనే ప్రత్యామ్నాయం అని అనుకున్నారు. కానీ.. తర్వాత బడ్జెట్, ఇక్కడి ప్రేక్షకుల ఆదరణను చూసి వెనక్కి తగ్గారు. తెలుగు కంటెంట్‌పై ఖర్చు చేయడం కంటే పాన్ ఇండియా అప్పీల్ ఉండే కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తే బెటర్ అని ఆలోచనలు చేస్తున్నారు.