Diwali Movies 2022 Telugu: ఈ వారం బాక్సాఫీస్ వద్ద నాలుగు చిత్రాలు పోటీపడ్డాయి. రెండు స్ట్రైట్ మూవీస్ కాగా… రెండు డబ్బింగ్ చిత్రాలు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ విన్నర్ ఎవరనే ఆసక్తి నెలకొంది. దీపావళి పండుగను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకేరోజు మూకుమ్మడిగా నిర్మాతలు సినిమాల విడుదలకు తెరలేపారు. విశ్వక్ సేన్ ఓరి దేవుడా, మంచు విష్ణు జిన్నా, కార్తీ సర్దార్, శివ కార్తికేయన్ ప్రిన్స్ చిత్రాలు అక్టోబర్ 21న విడుదలయ్యాయి. వీటిలో మూడు చిత్రాలు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. సర్దార్ మాత్రమే పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.

తమిళ చిత్రం ఓ మై కడవులే రీమేక్ గా ఓరి దేవుడా తెరకెక్కింది. అక్కడ మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేష్ కీలకమైన క్యామియో రోల్ చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓరి దేవుడా చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కింది. ఫస్ట్ డే వసూళ్లు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. సెకండ్ డే వసూళ్లు పంజుకుంటాయని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక కార్తీ సర్దార్ అంటూ బరిలో దిగారు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన సర్దార్ మూవీలో ఆయన డ్యూయల్ రోల్ చేశారు.
దర్శకుడు మిత్రన్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. క్లైమాక్స్ ఇంకొంచెం ఆసక్తిగా మలచి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఫస్ట్ డే వసూళ్లు పర్లేదు. సెకండ్ డే వసూళ్ళలో గ్రోత్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. సర్దార్ చెప్పుకోదగ్గ ప్రభావం చూపిస్తుంది. ఇక ప్రిన్స్ చిత్రం సైతం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అనుదీప్ కామెడీ అక్కడక్కడా పర్లేదు అనిపించినా ఓవర్ ఆల్ గా కథ, కథనం మెప్పించలేదంటున్నారు. వసూళ్లు సైతం అంత ఆశాజనకంగా లేవు.

శుక్రవారం విడుదలైన సినిమాల్లో జిన్నా పరిస్థితి దారుణం. కనీసం అర కోటి షేర్ కూడా జిన్నా సినిమాకు రాలేదు. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ జిన్నా బ్రేక్ చేస్తుంది. జిన్నా అంచనా కూడా వేయలేనంత డిజాస్టర్. మొత్తంగా దీపావళి విన్నర్ కార్తీ అని చెప్పొచ్చు. సర్దార్ మెరుగైన వసూళ్లు సాధిస్తుంది అంటున్నారు. అయితే రియల్ విన్నర్ మాత్రం కాంతార అని చెప్పాలి. రెండో వారం కూడా బాక్సాఫీస్ వద్ద కాంతారదే పైచేయి. కొత్త సినిమాలను కూడా పక్కన పెట్టి ప్రేక్షకులు కాంతార మూవీకి ఎగబడుతున్నారు.