Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గామి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఆ స్థాయిలో వసూళ్లు లేవు. గామి మూవీ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అయితేజోరు కొనసాగించలేకపోతుంది. గామి(Gaami) చిత్రానికి మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు నుండి విపరీతమైన పోటీ ఎదురవుతుంది. గామి చిత్రాన్ని తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. రాజమౌళి ప్రేమలు చిత్రాన్ని ప్రోమోట్ చేయడం జరిగింది. ఇటీవల సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. అదే సమయంలో ఒక వినూత్న సబ్జెక్టు తో తెరకెక్కిన గామి చిత్రానికి ప్రోత్సాహం కరవుతుంది.
ఈ క్రమంలో విశ్వక్ సేన్ మీడియా వేదికగా తన ఆవేదన వెళ్లగక్కాడు. గామి మూవీకి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారు. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు. ఇలా చేయడం సరికాదు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. తెలుసుకునేంత టైం కూడా నాకు లేదు. గామి మన తెలుగు సినిమా. ఒక యూనిక్ కంటెంట్ తో తెరకెక్కింది. తెలుగులో ఇలాంటి సినిమా గతంలో రాలేదని చెప్పగలను. ఓ నలుగురు పెద్దవాళ్ళు మా సినిమా చూసి మాట్లాడితే బాగుంటుంది.
గామి జర్నీ ఇప్పుడే మొదలైంది. ఓ ఇరవై ఏళ్ల తర్వాత కూడా గామి చిత్రం గురించి జనాలు మాట్లాడుకుంటారు. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అర్థం కానీ వాళ్ళు మరొక్కసారి చూడండి. సినిమా బాగుంది కాబట్టే మెజారిటీ ఆడియన్స్ చూస్తున్నారు… అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. పరోక్షంగా పరిశ్రమకు చెందిన సీనియర్, స్టార్ హీరోలు గామి మూవీ గురించి మాట్లాడితే ప్రచారం దక్కుతుంది. ఆడియన్స్ ఆసక్తి చూపే ఆస్కారం ఉంటుందనే అర్థంలో మాట్లాడాడు.
చెప్పాలంటే తన సినిమాకు ఇండస్ట్రీ నుండి ఎలాంటి సపోర్ట్ దక్కడం లేదని చెప్పకనే చెప్పాడు. గామి మూవీలో విశ్వక్ సేన్ అఘోర పాత్ర చేయడం విశేషం. అరుదైన వ్యాధితో బాధపడే అఘోరాగా ఆయన నటించారు. ప్రతికూల పరిస్థితుల మధ్య అఘోర ప్రయాణం సాగుతుంది. విద్యాధర్ కాగిత గామి చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ఓ కీలక రోల్ చేసింది. మార్చి 8న విడుదల చేశారు.