‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది?’ అంటూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్‌సేన్, తానే దర్శకుడిగా మారి, ‘ఫలక్‌నుమాదాస్’ అంటూ తానే హీరోగా సినిమా తీసి మొత్తానికి భారీ హిట్ కొట్టాడు. తాజాగా ఈ హీరో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన పర్సనల్ లైఫ్ లోని అనేక ఆసక్తికరమైన విషయాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
ముందుగా విశ్వక్ సేన్ అసలు పేరు ‘దినేశ్’. మరి విశ్వక్ సేన్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే.. జాతకాల ప్రకారం అలా పెట్టుకున్నాడట. అందుకే పేరును విశ్వక్ సేన్ గా మార్చుకున్నాడట. ఇంతకీ ‘విశ్వక్ సేన్’ పేరు బెంగాలీ పేరు. ‘విశ్వక్ సేన్’ తండ్రినే స్వయంగా తన కుమారుడికి పేరును మార్చారు. ఇక తన ‘ఫలక్‌నుమాదాస్’కి ప్రేరణ కృష్ణవంశీ అని చెప్పారు. ‘అంతఃపురం’, ‘సిటీ ఆఫ్ గాడ్స్’ లాంటి చిత్రాలు చూసి ఆ సినిమా తీసాడట.
అసలు హీరో అయిన తరువాత దర్శకుడిగా ఎందుకు మారవలసి వచ్చింది అని అడిగితే, తనకు 7వ తరగతిలోనే దర్శకత్వం చేయాలనే ఆలోచన వచ్చిందని ఈ యంగ్ మాస్ హీరో చెప్పుకొచ్చాడు. ఇక తనలాంటి కొత్తవాడిని పెట్టుకుని సినిమా ఎవరు తీస్తారు, అందుకే ఓన్ గా సినిమా చేయాలని విశ్వక్ అనుకున్నాడట. కానీ ఆ సమయంలో తన ఫోటోలను చూసిన తరుణ్ భాస్కర్ ‘అరె.. ఈ అబ్బాయి బాగున్నాడు’ పిలవండి’ అంటే వెళ్ళి కలిశాడట.
తరుణ్ భాస్కర్ దగ్గరకు వెళ్ళగానే, ‘ఫలక్‌నుమాదాస్’ సినిమా తీస్తున్నావంట కదా’ మరి నా సినిమా చేస్తావా ? అనగానే, విశ్వక్ సేన్ వినయంగా ‘మీరు సినిమా ఛాన్స్ ఇస్తే నా సినిమా ఆపేస్తా’ అని అన్నాడు. ఆ మాట తరుణ్ కి నమ్మకం కలిగించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో విశ్వక్‌సేన్ కి అవకాశం ఇచ్చాడు. అయితే వారం తర్వాత ఆ సినిమాలో తను లేడు. కారణం విశ్వక్ సేన్ గురించి ఎవరో అమ్మాయి తరుణ్ కి బ్యాడ్ గా మెయిల్ పెట్టింది.
‘అతను నాకు మత్తు మందు ఇచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా పరిస్థితి ఏ హీరోయిన్ కీ రావద్దు. మీరు వాడిని సినిమాలో పెట్టుకుంటే మీడియా ముందుకెళ్లి ఏం చేయాలో నాకు తెలుసు’ అని ఆ అమ్మాయి మెయిల్ చేసింది. ఇది తెలుసుకున్న విశ్వక్‌సేన్, ఇదంతా తను అంటే పడని వాడు కావాలని చేశాడని నిరూపించి.. మళ్ళీ ఆ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు.