Vishakha Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ( International yoga day) విశాఖ సిద్ధం అవుతోంది. దాదాపు 5 లక్షల మందితో యోగాసనాలు వేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు. యోగా దినోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. విశాఖ బీచ్ రోడ్ లో సెలవేగంగా ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీచ్ రోడ్డును పూర్తిగా మూసివేశారు. వేదిక నిర్మాణం చేపడుతున్నారు. మరోవైపు విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు జల్లెడ పడుతున్నారు. కేంద్ర భద్రతా బలగాలు సైతం విశాఖ నగరానికి చేరుకున్నాయి. అడుగడుగునా ఆంక్షలతో పాటు ట్రాఫిక్ మళ్లింపు జరుగుతోంది. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకకు విశాఖ వేదిక కావడంతో.. ప్రపంచంలో నగర ఖ్యాతి మరోసారి వెలిగిపోయే అవకాశం ఉంది. అందుకే విశాఖ నగర ప్రజలు సైతం దీనిని ఆహ్వానిస్తున్నారు.
ప్రధాని టూర్ షెడ్యూల్
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) పర్యటనకు సంబంధించి షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన వచ్చింది. ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నావికా దళానికి సంబంధించి గెస్ట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీ రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం 6:30 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకోనున్నారు. అక్కడ 7:45 గంటల వరకు యోగా దినోత్సవం లో పాల్గొంటారు. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం రేపు విశాఖ చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానం పలకనున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన నేరుగా విశాఖ చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ హాజరు పై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: International Yoga Day: ప్రాచీన భారతం నుంచి.. ఆధునిక ప్రపంచం వరకు.. యోగా ప్రస్థానం ఇదీ!
పాఠశాలలకు సెలవులు
అయితే విశాఖ( Visakhapatnam) నగరంలో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నగరంలోని అన్ని స్కూళ్లకు 20,21 తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారి ప్రత్యేక సర్కిలర్ జారీ చేశారు. దీంతో విద్యార్థులకు మూడు రోజులపాటు సెలవు దినాలు. మరోవైపు గురువారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్ రోడ్డు లో యోగా డే సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి కాళీమాత ఆలయం వరకు యోగ వాక్ చేశారు. విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్ కు ఎదురుగా యోగాసనాలు వేశారు. మంత్రులు డోల బాల వీరాంజనేయ స్వామి, సరిత, సత్య కుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు.
నలుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు
విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఏపీ పోలీస్ శాఖ( AP Police Department) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు కేటాయించింది. ఇప్పటికే నోడల్ అధికారిగా మల్లికార్జున ఉన్నారు. ఆయనకు సహాయం చేసేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది ప్రభుత్వం. రామ సుందర్ రెడ్డి, రోణంకి కూర్మనాధ్, గోవిందరావు, రోనంకి గోపాలకృష్ణకు విశాఖలో బాధ్యతలు అప్పగించింది. మరోవైపు విశాఖ బీచ్ రోడ్డు ను మూసి వేయడంతో ఇతర మార్గాల్లో వాహనాల రద్దీ పెరిగింది. మధురవాడ నుంచి నగరంలోకి వచ్చే జాతీయ రహదారి మార్గం రెండు వైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. మద్దిలపాలెం, వెంకోజీ పాలెం, హనుమంతు వాక, విశాఖ వ్యాలీ జంక్షన్, జూ పార్క్, ఎండాడ, పీఎం పాలెం, మధురవాడ ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది.
Also Read: PM Narendra Modi : ఏపీకి ప్రధాని.. ఢిల్లీ వెళ్లిన రెండో రోజే సంచలన నిర్ణయం!
భారీగా పోలీసు బందోబస్తు..
మరోవైపు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 12,000 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే విశాఖ నగరంలో ఐదు కిలోమీటర్ల పరిధిని నో డ్రోన్( no Drone area ) ప్రాంతంగా ప్రకటించారు. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బందిని సైతం నియమించారు. వారు ఈనెల 20న విధుల్లో చేరుతారు. 21న కార్యక్రమం ముగిసిన తర్వాత వారి వారి స్థానాలకు వెళ్తారు. అయితే ఇప్పుడు విశాఖలో ఎటువైపు చూసినా పోలీసులే. ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు, మరోవైపు భద్రత సిబ్బంది తాకిడితో విశాఖ నగర ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.