Thangalaan Trailer: విలక్షణ పాత్రలకు, ప్రయోగాలకు పెట్టింది పేరు విక్రమ్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వలె స్టార్డం చట్రంలో ఇరుక్కోకుండా అనేక భిన్నమైన పాత్రలు, సబ్జక్ట్స్ చేశారు. పాత్రకు తగ్గట్టుగా శరీరాన్ని మార్చుకునే అరుదైన నటుడు విక్రమ్. ఈ టాలెంటెడ్ హీరో నుండి వస్తున్న మరో మాస్టర్ పీస్ తంగలాన్. దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించారు. తంగలాన్ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా ట్రైలర్ విడుదల చేశారు.
రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ అబ్బురపరిచింది. సినిమాపై ఆసక్తి పెంచేసింది. పీరియాడిక్ సెటప్, కాస్ట్యూమ్స్, గెటప్స్ చాలా సహజంగా ఉన్నాయి. విజువల్స్ మెస్మరైజ్ చేశాయి. విక్రమ్ నటన, మేకోవర్ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పాలి. వెనుకబడిన తెగకు చెందిన మొరటోడుగా విక్రమ్ కనిపిస్తున్నారు. అనాగరికుడిగా కట్టిపడేసాడు. గతంలో ఎన్నడూ చూడని గెటప్ లో విక్రమ్ మైండ్ బ్లాక్ చేశాడు.
తంగలాన్ చిత్రానికి జి వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఆయన బీజీఎం చాలా బాగుంది. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ తో కథపై ఓ హింట్ ఇచ్చారు. తంగలాన్ బ్రిటీష్ కాలం నాటి కథ. ఓ ప్రాంతంలో బంగారం దొరుకుతుందని తెలిసిన బ్రిటీష్ దొర మారుమూల గ్రామానికి వస్తాడు. బంగారం తవ్వి తీసేందుకు సహాయం చేయాలని గ్రామస్థులను కోరతాడు. అందుకు వారు ఒప్పుకుంటారు. తవ్వకాలు మొదలయ్యాక అసలు సమస్యలు మొదలవుతాయి.
ఎంత తవ్వినా, వెతికినా గోల్డ్ దొరకదు. ఈ క్రమంలో అనేక పోరాటాలు, యుద్దాలు చోటు చేసుకుంటాయి. ఈ తతంగంలో ఓ మంత్రగత్తె పాత్ర కూడా ఉంటుంది. మరి దొర కోరుకున్న బంగారం దొరికిందా? జీవన్మరణ పోరాటంలో గెలిచింది ఎవరు? అనేది కథ. పార్వతి, మాళవిక మోహనన్ కీలక పాత్రలు చేశారు. తంగలాన్ ఆగస్టు 15న పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. కే ఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.