Vijaysai Reddy- Pushpa Movie: ఏపీలో ట్విట్టర్ ఫాలో అయ్యే నాయకుల్లో ముందుంటారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. సమకాలిన రాజకీయాంశాలపై ఆయన స్పందిస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై ట్విట్టర్ లో విరుచుకుపడుతుంటారు. అంతటితో ఆగకుండా బూతు అర్ధం వచ్చేలా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. తనకు ఓ స్థాయి ఉందని చెబుతూనే దిగువస్థాయి నేతలు, ప్రముఖులపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. ట్విట్టర్ లోనే కలబడతారు..నిలబడతారు. చివరకు ఛీ పో నా స్థాయి ఏమిటో తెలుసా అంటూ ట్విట్టర్ యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తారు. అయితే నిత్యం ఒకటి మాత్రం మెంటెయిన్ చేస్తారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర పెద్దలను మాత్రం పొగుడుతూ వస్తారు. అది కూడా వారికి అర్ధమయ్యేలా హిందీలో ట్విట్ చేస్తారు. ఇటీవల తెలుగు రాజకీయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న దాఖలాలు లేవు. అటు లిక్కర్ స్కాంలో తన సమీప బంధువుల పేర్లు వినిపిస్తుండడంతో అటువైపు దృష్టిసారించినట్టున్నారు. అందుకే కేంద్ర పెద్దలపై తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ప్రశంసల వెనుక…
అయితే ఎంపీ విజయసాయి మనసు ఇప్పుడు తెలుగు సినిమా రంగంపై పడింది. ఇటీవల సైమా అవార్డ్స్ దక్కించుకున్న తెలుగు సినిమా ‘పుష్ప’ సినిమాపై తన ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించారు. తన నటనతో తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కు అభినందనలు తెలిపారు.తెలుగు సినిమా ‘తగ్గేదేలే’ అన్న ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. అయితే విజయసాయిరెడ్డి తాజా ట్విట్ చర్చనీయాంశమైంది. ఇది ముమ్మాటికీ మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడానికేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మెగాస్టార్ రాజకీయాలను పక్కన పెట్టి తన పనితాను చేసుకుంటున్నారు. మిగతా మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన యువ హీరోలు సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు. మరోవైపు అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో చిచ్చు రగిల్చిందుకే విజయసాయిరెడ్డి కొత్త ఎత్తుగడ అన్న కామెంట్స్ అయితే మాత్రం అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
కుట్ర కోణం..
విజయసాయిరెడ్డి ట్విట్ వెనుక మాత్రం ఏదో కుట్ర ఉందన్న అనుమానం అభిమానుల నుంచి వినిపిస్తోంది. పుష్ప సినిమా విడుదల సమయంలో టిక్కెట్ల రచ్చ ఉంది. ఏపీ ప్రభుత్వం అదే సమయంలో ఆన్ లైన్ టిక్కెట్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. అయినా చిత్ర యూనిట్ డేరింగ్ చేసి సినిమాను రిలీజ్ చేసింది. సినిమా విజయవంతంగా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో మంచి చిత్రంగా గుర్తింపు సాధించింది. నాడు ఎప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడిన సందర్భాలు లేవు. ఇప్పుడు సైమా అవార్డులు సొంతం చేసుకున్న రెండు రోజుల తరువాత స్పందించారు. అభినందన ట్విట్ పెట్టారు. సినిమా రిలీజ్ అయినప్పుడు ఇబ్బందులు పెట్టి.. సినిమా సక్సెస్ గా నిలిచిన తరువాత స్పందించకుండా.. ఇన్నాళ్లకు ఈ ట్విట్ ఏమిటంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నలవర్షం కురపిస్తున్నారు. ఇది కాక పట్టడానకేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కేంద్ర పెద్దల ప్రాపకం కోసం…
ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలకు కాస్తా దూరంగా ఉన్నారు. ప్రతిరోజూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ తొ పాటు రాజకీయ ప్రత్యర్థులపై ట్విట్టర్ వేదికగా చేసుకొని వ్యంగ్యోక్తులు సంధించే వారు. పలుచన చేసి మాట్లాడేవారు. ఎగతాళి చేసేవారు. కానీ ప్రస్తుతం ఆయన మన నేతలపై కామెంట్స్ తగ్గించారు. ఇప్పుడంతాప్రధాని మోదీ, కేంద్ర పెద్దల పొగడ్తలకే టైమ్ ను కేటాయిస్తున్నారు. అటు తనపై ఉన్న కేసులతో పాటు కొత్తగా అల్లుడి మెడకు చుట్టుకున్న లిక్కర్ స్కామ్ నుంచి బయట పడేందుకు…. కేంద్ర పెద్దల ప్రాపకం తెగ ప్రయత్నిస్తున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకుగాను తన ట్విట్టర్ ఖాతాను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి కేంద్ర పెద్దలకు ఎన్నిరకాల పొగడాల్లో అన్నిరకాల పొగడ్తలతో ముంచెత్తాలని పురమాయించినట్టు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ యువనేత రాహూల్ గాంధీ పాదయాత్రపై కూడా దుష్ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై నెటిజెన్లు మండిపడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తమ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న పుష్ప చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించి నిజమైన రాజకీయ నాయకుడు అనిపించుకున్నారు విజయసాయిరెడ్డి.