పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తోంది. ఈ చిత్రంపై సాధారణ ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. చాలా కాలం తర్వాత తాను థియేటర్లో సినిమా చూశానని చెప్పారు. అత్తారింటికి దారేది తర్వాత తన తమ్ముడి సినిమాను చూడలేదన్నారు.
దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అయితే.. ఈ సినిమాలో పవన్ నటించలేదని అన్నారు నాగబాబు. నిజ జీవితంలో పవన్ ఎలా ఉంటాడో.. సినిమాలోనూ అలాగే ఉన్నాడని చెప్పారు. రియల్ లైఫ్ లో తమ్ముడు సాధారణ జీవితం గడుపుతుంటాడని చెప్పారు మెగా బ్రదర్.
ఇక, ఏపీలో వకీల్ సాబ్ ఇష్యూపైనా ఆయన స్పందించారు. బెనిఫిట్ షోలు నిలిపేయడం సీఎం జగన్ కు తెలియకపోవచ్చని అన్నారు. పరిపాలనలో తీరికలేకుండా ఉండే ఆయనకు.. ఈ విషయం తెలియకపోవచ్చని, తెలిస్తే తప్పకుండా స్పందించే ఛాన్స్ ఉందన్నారు. ఆయన అలాంటి వ్యక్తి కాదని తాను నమ్ముతున్నానని చెప్పారు.
జిల్లాల్లో ఉండే ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మాత్రమే ఈ పనులు చేసి ఉంటారని అన్నారు నాగబాబు. అయితే.. ఎవరు చేసినా ఇది సరికాదని అన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పర్వాలేదుగానీ.. వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు సృష్టించొద్దన్నారు. దానివల్ల సినిమాపై ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.