
రెగ్యులర్ గా సినిమాలు వచ్చినప్పుడే.. పవర్ స్టార్ మేనియా ఆకాశాన్ని తాకేది. ఇప్పుడు.. మూడేళ్ల తర్వాత తెరపై కనిపించబోతున్నారు. ఇక, అభిమానుల హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సరిగ్గా పది రోజుల గడువు ఉంది. అయితే.. ఇప్పటి నుంచే టిక్కెట్ల వేట మొదలుపెట్టేశారట ఫ్యాన్స్.
అయితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీస్థాయిలో జరిగింది. ఒక్క ఆంధ్ర ఏరియాలోనే రూ.42 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. ఈ రేంజ్ ను అందుకోవాలంటే పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సి ఉంది. అయితే.. రిజల్ట్ ఎలా ఉంటుందన్నది ముందుగానే ఎవరూ చెప్పలేరుకాబట్టి… మొదటి మూడు రోజుల్లోనే అందినకాడికి రాబట్టాలని చూస్తున్నారట బయ్యర్లు.
ఇందుకోసం ముందస్తుగా బెనిఫిట్ షోలపై దృష్టి సారించారట. విశాఖలో అర్ధరాత్రి నుంచి మూడు బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారట. దీనికి గానూ టికెట్ కు ఏకంగా రూ.1500 నిర్ణయించినట్టు సమాచారం. తెల్లవారు జామున వేసే షోలకు రూ.500 రేటు నిర్ణయించినట్టు సమాచారం. ఆ తర్వాత నుంచి మొదలయ్యే రెగ్యులర్ షోలకు రూ.200 రేటు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తొలి వారం మొత్తం ఈ రేటు కొనసాగుతుందని తెలుస్తోంది.
రేటు ఎంతపెట్టినా సరే.. తొలిరోజే సినిమా చూసేందుకు ఫ్యాన్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు టికెట్ల కోసం బయ్యర్ల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక, వకీల్ సాబ్ చిత్రానికి కూడా అన్ని విధాలా కలిసివస్తోంది. వారం ముందు రిలీజ్ కావాల్సిన సీటీ మార్ వెనక్కు వెళ్లిపోయింది. వైల్డ్ డాగ్ థియేటర్లు ఒక్క వారానికే అగ్రిమెంట్ చేశారట. సుల్తాన్ ఎలాగో డబ్బింగ్ సినిమా. కాబట్టి.. ఏ మాత్రం పాటివ్ టాక్ వచ్చినా.. బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమనే టాక్ నడుస్తోంది.