Love Me OTT: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలో ప్రత్యక్షం అయ్యింది బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ. దీంతో ఓటీటీ ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఆశిష్-వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ఎక్కడ చుడొచ్చో తెలుసుకుందాం. బేబీ చిత్రంతో బ్లాక్ బస్టర్ నమోదు చేసింది వైష్ణవి చైతన్య. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ ట్రయాంగిల్ లవ్ డ్రామా యూత్ కి తెగ నచ్చేసింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు.
లవ్ మీ టైటిల్ తో అరుణ్ భీమవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. లవ్ మీ చిత్ర ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. సమ్మర్ కానుకగా మే 25న లవ్ మీ చిత్రాన్ని విడుదల చేశారు. ఫస్ట్ షో నుండే లవ్ మీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. త్వరగా థియేట్రికల్ రన్ ముగిసింది. మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
లవ్ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. దీంతో జూన్ 14 నుండి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి ప్రచారం లేకుండా ఓటీటీలో విడుదల చేయడం విశేషం. వైష్ణవి చైతన్య అభిమానులు మరోసారి లవ్ మీ చూసి ఎంజాయ్ చేయవచ్చు.
లవ్ మీ మూవీ కథ విషయానికి వస్తే… అర్జున్(ఆశిష్)ప్రతాప్(రవికృష్ణ) ఫేమస్ యూట్యూబర్స్. వాళ్ళు జనాల్లో ఉన్న మూఢనమ్మకాలు తొలగించే అవగాహన వీడియోలు చేస్తుంటారు. దెయ్యాలు,భూతాలు ఉన్నాయి అంటే అసలే నమ్మరు. కానీ తమ ఊరిలోని ఓ బంగ్లాలో దెయ్యం ఉందని, అది ఆ బంగ్లాలోకి వెళ్లిన ప్రతి ఒక్కరినీ చంపేస్తుంది అనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. ఈ దెయ్యం సంగతి ఏంటో తేల్చాలని ఆ భవనంలోకి అర్జున్ వెళతాడు. అక్కడ అర్జున్ కి ఎదురైన పరిస్థితులు ఏంటి? నిజంగానే దెయ్యం ఉందా? ఉంటే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ…