CM Revanth Reddy: భూముల విలువ పెంపు లాభమా నష్టమా.. రేవంత్‌ ఆలోచించుకోవాలి!

ప్రస్తుతం రేవంత్‌రెడ్డి రుణమాఫీకి సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులు సమీకరణపై దృష్టిపెట్టారు. రుణమాఫీ అర్హులను గుర్తించేందుకు కండీషన్లు పెట్టారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ రేవంత్‌కు సవాల్‌గా మారింది.

Written By: Raj Shekar, Updated On : June 14, 2024 1:43 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలో 400కుపైగా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా.. ఆరు గ్యారంటీలు అమలు కాలేదు. మరోవైపు మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. లోక్‌సభ ఎన్నికలు కూడా ముగియడంతో సీఎం రేవంత్‌రెడ్డి హామీల అమలుపై దృష్టిపెట్టారు.

రుణమాఫీకి కసరత్తు..
ప్రస్తుతం రేవంత్‌రెడ్డి రుణమాఫీకి సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధులు సమీకరణపై దృష్టిపెట్టారు. రుణమాఫీ అర్హులను గుర్తించేందుకు కండీషన్లు పెట్టారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ రేవంత్‌కు సవాల్‌గా మారింది.

భూముల విలువ పెంపు..
శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆయా శాఖల నుంచి రావాల్సిన బకాయిలు సమీకరిస్తున్నారు. ఈ క్రమంలో భూముల విలువ పెంపుపైనా దృష్టి పెట్టారు. భూముల విలువ పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖజానాకు వచ్చే ఆదాయంలో మద్యం మొదటి స్థానంలో ఉండగా, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తర్వాతి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే భూముల విలువ పెంచాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. తద్వారా భారీగా ఖజానాకు నిధులు వస్తాయని అంచనా వేస్తోంది.

బెడిసి కొడితే నష్టమే..
భూముల విలువ పెంపు విషయంలోనూ రేవంత్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మూడు నాలుగుసార్లు భూముల విలువలు సవరించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కానీ, సామాన్యులకు ఎలాంటి లబ్ధి కలుగలేదు. దీంతోపాటు ల్యాడ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు కూడా మొన్నటి ఎన్నికల్లో జగన్‌ ఓటమికి కారణమయ్యాయి.

విలువ ఉన్న ప్రాంతాల్లో పెంచాలి..
భూముల విలువ పెంపు అంటే .. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లోనే పెంచాలి. డిమాండ్‌ లేని ప్రాంతాల్లో భూముల విలువ పెంచితే అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకు జగన్‌ చేసిన ప్రయోగమే నిదర్శనమంటున్నారు. జూన్‌ 15 లేదా 18న నిర్వహించే కేబినెట్‌ మీటింగ్‌లో భూముల విలువలు సవరించే అవకాశం ఉందని తెలుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.