‘అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు’ అంటాడు త్రివిక్రమ్. ఉప్పెన పేపరు మీద ఉన్నప్పుడు.. సెట్స్ పైకి వెళ్లినప్పుడు.. థియేటర్లోకి రాబోతున్నప్పుడు.. ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఎంతమంది గుర్తించి ఉంటారు? అంటే.. ఈ ప్రశ్నకు ఎవరూ ఉండకపోవచ్చనే సమాధానమే వస్తుంది.
Also Read: ముసలాడిగా రవితేజ.. మళ్ళీ ప్రేమ కథ కూడా !
ఎందుకంటే.. ఓ కొత్త హీరో, ఓ కొత్త హీరోయిన్, వీళ్లిద్దరినీ తెరపై చూపించే ఓ కొత్త దర్శకుడు. ఈ ముగ్గురూ కలిసి ఓ ప్రేమ కథను జనాలకు చెప్పేందుకు బయల్దేరారు. ఇలాంటి వారిపై ఎలాంటి అంచనాలుంటాయి? కుదిరితే పాస్ మార్కులు.. మహా అయితే.. ఫస్ట్ క్లాస్ వస్తుందని అనుకుంటారు. కానీ.. ఈ సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ రావడమే ఇక్కడ ఊహకందని విషయం. అసలిదంతా ఎలా సాధ్యమైందా? అని ట్రేడ్ అనలిస్టులు కూడా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
విడుదలైన తొలి రోజు క్లైమాక్స్ విషయంలో కాస్త డివైడ్ టాక్ వినిపించినప్పటికీ.. ఉప్పెన జోరులో అది లెక్కలోకే రాలేదు. మొదటి ఆటనుంచే అప్రతిహతంగా దూసుకెళ్లిన సినిమా.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడు వారాలు దాటిన తర్వాత కూడా సత్తా చాటడం విశేషం. 22వ రోజు కూడా 10 లక్షల షేర్ సాధించింది. అయితే.. సినిమా బ్లాక్ బస్టర్ అనడంలో ఎవరికీ సందేహం లేదుగానీ.. కలెక్షన్ విషయంలోనూ నిర్మాతలకు, ట్రేడ్ అనలిస్టులకు పొంతన కుదరట్లేదు.
Also Read: పెళ్లి బాధలో మరో ముదురు భామ !
తమ సినిమా వంద కోట్లు సాధించిందంటూ మైత్రిమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం. ఈ మేరకు 100 కోట్ల కలెక్షన్ రాబట్టినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే.. ట్రేడ్ పండితులు మాత్రం రూ.80 కోట్ల చిల్లర చూపిస్తున్నారు. మరి, ఏమేం లెక్కలు వేసుకున్నారో తెలియదుగానీ.. తమ సినిమా వంద కోట్లు సాధించిందని మాత్రం డిక్లేర్ చేసేశారు మేకర్స్.
సినిమా రిలీజ్ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఉప్పెన వంద కోట్ల సినిమా అవుతుందని అన్నారు. మొదటి ఆట చూసిన తర్వాత కూడా ఇదే మాట రిపీట్ చేశారు. అంటే.. సినిమాకు ఊపురావడానికి అన్నాడో.. లేదంటే మనం పైన చెప్పుకున్నట్టు జరగబోయే అద్భుతాన్ని ముందే గుర్తించాడో కానీ.. మొత్తానికి 100 కోట్ల సినిమా అన్నాడు. ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ ద్వారా దాన్ని నిజం చేశారు. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ డెబ్యూ హీరో మూవీ.. ఓ ట్రేడ్ మార్క్ ను సెట్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్