నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. బాలయ్య గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఐతే, బాలయ్య గురించి పెద్దగా ఎవరికీ తెలియని విషయాలను పరిశీలిద్దాం. బాలయ్య స్వభావంలాగే, ఆయన పర్సనల్ లైఫ్, అలాగే ఆయన సినీ కెరీర్ కూడా అంతా ఓపెన్ బుకే. బాలయ్యను దూరం నుండి చూసిన వాళ్ళు, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అనుకున్నా, ఆయన మనసు మాత్రం స్వచ్ఛమైన వెన్న లాంటిది.
ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు, వాళ్ళు తనను సాయం చేయమని అడగకపోయినా.. బాలయ్య వెంటనే వారికి సాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆయనలోని సేవా గుణానికి పరిమితులు పరిధులు లేవు. సినిమా ఇండస్ట్రీలో సహజంగా ప్రతి ఒక్కరికీ ఇగో కవచంలా ఉంటుంది. కాస్త పేరు వస్తే చాలు, కింద స్థాయి వ్యక్తులను పురుగులను చూసినట్టు చూస్తారు. కానీ బాలయ్యది డైమండ్ స్పూన్.
అయినా, ఉదయం షూట్ కి వెళ్ళగానే సెట్ బాయ్ ను కూడా నవ్వుతూ పలకరించడం, తోటి నటీనటులకు ఎంతో గౌరవం ఇవ్వడం, వారి వారి పొజిషన్ లతో సబందం లేకుండా అందర్నీ ఒకేలా చూడటం బాలయ్యలోని గొప్పతనం. జూనియర్ ఆర్టిస్ట్ ల పట్ల ఏ హీరో అంత మర్యాదగా ప్రవర్తించడం నేను చూడలేదు అంటూ ఆయన పక్కన నటించిన హీరోయిన్లు అంజలి, ప్రగ్యా జైస్వాల్, నమిత, వేదిక, నయనతార, కత్రినా కైఫ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ ఇంటర్వ్యూల్లో బాలయ్య బాబు వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు వీడియోలో రూపంలో ఎన్నో ఉన్నాయి.
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు.. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న బాలయ్య వ్యక్తిగత జీవితం పైనే ఎన్నో విమర్శలు ఉన్నాయి. కానీ సినిమా సెట్ లోనే కాదు, బయట కూడా బాలయ్య చాలా సరదాగా ఉండటాన్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతుంటారు. మొత్తమ్మీద బయట బాలయ్య పై ఉన్న టాక్ కి, బాలయ్య ప్రవర్తనకు చాల తేడా ఉంది. ముఖ్యంగా బాలయ్య ఎప్పుడు ఎలా ఉంటారో.. ఏ నిముషంలో ఆయన మూడ్ ఎలా మారుతుందో తెలియదు అని భయపడుతూ ఉంటారు.
అవును నిజమే, ఎదుటి వ్యక్తిలో తప్పు కనిపిస్తే బాలయ్య క్షమించరు, కానీ, ఖచ్చితత్వంతో ఉండే వ్యక్తులు అంటే బాలయ్యకు ఎంతో అభిమానం. ఏది ఏమైనా బాలయ్యది విభిన్నమైన శైలి, బాలయ్య ప్రవర్తన వైవిధ్యమైన నైజం. అందుకే బాలయ్య ప్రత్యేకమైన వ్యక్తి. ఇక చాల సంవత్సరాల తరువాత బాలయ్య అఖండ టీజర్ తో తన పంజా రుచి చూపించాడు. ఈ టీజర్ బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది.
నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య బాబు సినిమాలు స్టార్ హీరో సినిమాల లాగా చలామణి అవ్వడం లేదనేది అక్షర సత్యం. కానీ, అఖండ బాలయ్య రేంజ్ ని, క్రేజ్ ని మరోసారి గుర్తుకు చేసింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి రికార్డును బద్దలు కొట్టింది. బాలయ్యకి ఇంకా ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అని ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి అంటేనే, బాలయ్య స్టార్ డమ్ ఏమిటో అర్థం అవుతుంది.
ఇప్పటికీ సరైన సినిమా పడితే.. రికార్డ్స్ ను బ్రేక్ చేయగల సత్తా బాలయ్యలో ఉందని ‘అఖండ’ టీజర్ నిరూపించింది. బాలయ్య సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన శైలిలో వెళ్తూ ప్రత్యేకతను చాటుకున్నారు. జగన్ ప్రభంజనంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నంబర్ వన్ హీరోనే ఓడిపోయారు, కానీ బాలయ్య అఖండ విజయం సాధించారు. ఇప్పటివరకూ రాజకీయాల్లో ఓడిపోని తెలుగు సినిమా నటుడు కూడా ఒక్క బాలయ్య బాబునే. ఇది బాలయ్యకు మాత్రమే సాధ్యం అయిన అరుదైన రికార్డు.
అలాగే ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజల కోసం చేస్తున్న సేవలు కూడా ఏ రాజకీయ నాయకుడు ఇప్పటివరకు చేయలేదు అని హిందూపురం ప్రజలే గర్వంగా చెబుతుండటం బాలయ్యకి దక్కిన మరో అరుదైన గౌరవం. బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు.