సినిమా మొదలు పెట్టడమే అత్యంత దిగువస్థాయి ఆలోచనతో మొదలవుతుంది. ఎదో ఆడ మగ శివాలూగుతూ హోళి పండుగలో బుక్కా గులాల్లు చల్లుకున్నట్టు.. ఈ సినిమాలో కూడా రెండు వర్గాలు కారం పొల్లు జల్లుతూ కొడవళ్లు ఎత్తుతూ నరకడాలతో సినిమాని మొదలుపెట్టారు. ఈ ఒక్క మెతుకు సరిపోతుంది కదా.. ఈ సినిమా మిగిలిన బాగోతాన్ని వివరించడానికి.
అసలు తలా తోకా లేని కథే బాగా ఇబ్బంది పెడుతుంది అంటే.. పేలవమైన కథనం, ఆ కథనంలో ఇరికించిన కథా సంవిధానం.. ఇలా సగటు ప్రేక్షకుడిని అన్ని రకాలుగా కష్టపెట్టిన సినిమా ఇది. కొన్ని చోట్ల అయితే, సినిమా చూసేవాళ్లకు జుట్టు పీక్కునే పరిస్థతి వచ్చింది. అయినా కథ విన్నప్పుడే ఇది ఏ జమానాకి చెందిన కథో అని ఇట్టే అర్థమైపోతుంది కదా.
మరీ నానికి ఎందుకు అర్ధం కాలేదు ? అసలు ఈ సినిమాలో ఒక దిక్కుమాలిన సీన్ గురించి ముచ్చటించుకుందాం. ఓ సన్నివేశంలో మచ్చుక్కి బ్రతికున్న పెళ్ళాన్ని పాత పెట్టడానికి ఇంటి ఆవరణలో మొగుడు సరిగ్గా నాలుగు మూలల బొంద తవ్వుతాడు, అయితే.. మన హీరోగారు ఆ మొగుడినే అందులో సమాధి చేస్తాడు.
ఇంత పైశాచికంగా ఎలా ఆలోచనలు వస్తాయో ? వాటిని ఎలా తీస్తారో ? వెనకా ముందు, కుటుంబం, సమాజం, చట్టం, న్యాయం ఇలాంటి ఆలోచనలు ఈ దర్శకుడికి తట్టలేదా ? దీనికితోడు ఇంతవరకు చూడని చెత్త నటనతో రావు రమేష్, జగపతి బాబు పోటీ పడ్డారు. అన్నిటికీ మించి సినిమాలో ఏ పాత్ర ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మాయ మౌతుందో అర్ధం కానీ పరిస్థితి. చివరగా జగదీశ్వర వద్దురా మాకు ఈ బాధ.