
BJP Politics: దేశంలోనే ఇప్పుడు అత్యంత బలవంతులు ప్రధాని మోడీ(Modi), కేంద్రహోంమంత్రి అమిత్ షా(Amith Shaw). అలాంటి పరిపాలకులు.. ఏ తప్పు జరిగినా కింది వారినే శిక్షిస్తున్నారు. ఇటీవల కరోనా కల్లోలం.. దేశంలో వ్యతిరేకత, ట్విట్టర్ తో గొడవల నేపథ్యంలో మొత్తం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే విఫలమైందన్న విమర్శలు వచ్చాయి. మోడీ పాలన తీరును చాలా మంది విమర్శించారు. అయితే ఇందుకు బాధ్యులుగా చేసి సీనియర్ కేంద్రమంత్రులకు మంగళంపాడి కొత్త వారిని బీజేపీ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ గెలుపు కోసం ఉన్న సీఎంను దించేశారు. కర్ణాటకలో యడ్యూరప్పపై వ్యతిరేకతను తగ్గించేందుకు దించేశారు. అసోంలోనే అదే పరిస్థితి. అసలు బీజేపీ ముఖ్యమంత్రులను ఎందుకు మారుస్తోంది? ఎవరూ నోరెత్తడం లేదు ఎందుకు? తప్పు బీజేపీలో జరిగితే కిందిస్థాయి నేతలను ఎందుకు బలి చేస్తున్నారు. పైన వారిని ఎందుకు టచ్ చేయడం లేదు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానాన్ని భూపేంద్ర పటేల్ కు అప్పగించారు. కేంద్రంలో, గుజరాత్ లో అధికారంలో ఉన్నది బీజేపీనే. అందువల్ల ఇక్కడి ముఖ్యమంత్రి మార్పునకు కారణం ఎవరో అందరికీ తెలుసు. కేంద్రం కనుసన్నల్లోనే ముఖ్యమంత్రి మార్పు జరిగిందని అర్థమైపోతుంది. తన పదవి పోయినందువల్ల విజయ్ రూపానీ ఎలాంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. పైగా ఆయనే స్వయంగా తన బాధ్యతలను భూపేంద్ర పటేల్ కు అప్పగించారు. అయితే పార్టీలో సౌమ్యుడిగా పేరున్న విజయ్ రూపాని ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కనీసం ఆయనపై అవినీతి ఆరోపణలు లేవు. మరికొద్దిరోజుల్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో సడెన్ గా ఆయనను పదవి నుంచి తొలగించడానికి కారణమేంటి..? అలాగే కర్ణాటక, ఉత్తరాఖండ్, అసోంలలో సీఎంలను బీజేపీ ఎందుకు మార్చింది..?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పార్టీ పటిష్టతకు ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్నారు. ఎక్కడా చిన్న రిమార్క్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2017 అసెంబ్లీలో అప్పటి వరకు కొందరికి పూర్తిగా తెలియని విజయ్ రూపానీని సీఎం అభ్యర్థిగా బరిలోకి దించింది. అయితే ఇక్కడ విజయ్ రూపానీ వ్యక్తిగతంగా కంటే మోడీ చరిష్మాతోనే ఓట్లు, సీట్లు ఎక్కువగా వచ్చాయని చెప్పుకోవచ్చు. అందువల్ల విజయ్ రూపానీ సీఎం సీట్ లో కూర్చోగలిగారు. అయితే ఆయన ప్రభుత్వాన్ని నడించిగలరు గానీ.. ఓట్లు సాధించలేరనే విషయం బీజేపీకి తెలుసు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం మార్పు చేశారని తెలుస్తోంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మార్చడం కేవలం గుజరాత్లోనే కాదు. మొన్నటికి మొన్న కర్ణాటకలో బీఎస్ యడ్యూరప్పను కూడా సీఎం పదవి నుంచి అధిష్టానం తప్పించింది. ఆయన అధిష్టానం నిర్ణయం ప్రకారం తప్పుకుంటున్నానని ప్రకటించారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని కూడా తెలిపారు. ఇక ఉత్తరాఖండ్ సీఎంగా ఎన్నికైన తీరథ్ సింగ్ రావత్ ఈ ఏడాది మార్చిలోనే పీఠంపై కూర్చన్నారు. కానీ ఆయన స్థానంలో మరొకరిని నియమించారు. అలాగే అసోంలోనూ శర్భానంద సోనోవాల్ ను తప్పించి హిమంత బిస్వ శర్మకు అవకాశం ఇచ్చారు. వీరంతా తమ పదవుల నుంచి తప్పించడంతో అధిష్టానంపై ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఒకవేళ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసు.
ప్రస్తుతం కేంద్రంలో, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి గుజరాత్ లోనే వ్యతిరేకత ఉందన్న వాస్తవం గుర్తించించి అధిష్టానం. గురజాత్ విషయానికొస్తే కరోనా మహమ్మారి విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది. ఇటీవల సూరత్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎలాంటి మద్దతు లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ 27 సీట్లను గెలుచుకోగలిగింది. మరోవైపు జైన్ సామాజిక వర్గానికి చెందిన విజయ్ రూపానికి ఆ వర్గం ఓట్లు కేవలం 2 శాతమే మాత్రమే ఉన్నాయి. బలమైన సామాజిక వర్గంగా ఉన్న పటీదార్లు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ రూపానీ స్థానంలో భూపేంద్రపటేల్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలా ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా బీజేపీ తమ పార్టీ నాయకులకు ఓ సందేశాన్ని ఇచ్చినట్లయింది. పార్టీ అధికారంలో ఉన్నా క్యాడర్ సపోర్టు లేకుంటే కష్టమేనన్న సంకేతాలను పంపించింది. దీంతో క్యాడర్ మిస్సవుతున్న రాష్ట్రాల్లో అధిష్టానం నేరుగా రంగంలోకి దిగి ఇలాంటి చర్యలు చేపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లో విజయం కోసం కొన్ని రిస్క్ నిర్ణయాలు తీసుకోక తప్పదని, దీంతో మిగతా నాయకుల్లో భయం పుట్టి పార్టీ కోసం సరైన దారిలో వెళతారని బీజేపీ భావిస్తోంది.