తెలుగు సినీ చరిత్రలోనే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది వకీల్ సాబ్ చిత్రం. ఇక, సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫస్ట్ వీక్ లో దుమ్ములేపే కలెక్షన్లు కొల్లగొట్టింది. ఆంధ్రప్రదేశ్ లో అడ్డంకులు ఎదురైనప్పటికీ.. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధించిందీ చిత్రం. తొలి రోజున రూ.45 కోట్ల గ్రాస్ ను రాబట్టిన సినిమా.. ఎదురే లేకుండా దూసుకెళ్లింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్ లోనూ వకీల్ సాబ్ సత్తాచాటాడు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ వంటి చోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించింది. లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఈ భారీ చిత్రం.. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కలెక్షన్లు సాధించింది. అత్యంత వేంగా 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది.
అయితే.. కరోనా సెకండ్ వేవ్ కలెక్షన్లపై ప్రభావం చూపుతూ వచ్చింది. రోజు రోజుకూ వసూళ్లు భారీగా తగ్గుతూ వచ్చాయి. మనదేశంతోపాటు, అమెరికాలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఓవర్సీస్ బ్రేక్ 1.3 మిలియన్ డాలర్స్ కాగా.. ఆ మార్కు చేరుతుందా? లేదా? అనే ఆందోళనకు కూడా బయ్యర్లలో నెలకొన్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
అయితే.. తొలి వారాంతం నుంచి కరోనా తీవ్రత పెరుగుతూ వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. అయితే.. రెండో వీక్ మొదలైన కానుంచి.. పరిస్థితి మారిపోయింది. కరోనా మరింతగా విజృంభించడంతో.. అదే స్థాయిలో కలెక్షన్లు పడిపోతూ వచ్చాయి. కానీ.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా పేర్కొనే ఉమైర్ సంధు మాత్రం.. ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ రూ.175 కోట్లు కలెక్ట్ చేసినట్టు నిన్న ప్రకటించారు.
అయితే.. ఈ లెక్కలపై ట్రేడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కరోనా తీవ్రత కొనసాగడంతో వసూళ్లు పడిపోయాయని, అందువల్లో ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఉగాది నాటికే భారీగా కలెక్ట్ చేసిందని, మిగిలిన రోజులు కలుపుకుంటే ఖచ్చితంగా రూ.175 కోట్లు సాధించే ఉంటుందని అంటున్నారు.
నిర్మాత దిల్ రాజు మాత్రం ఇప్పటికీ కలెక్షన్ల విషయంలో స్పందించలేదు. ఇకపై స్పందించే ఛాన్స్ కూడా లేదు. దీంతో.. ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్లు చెప్పేస్తున్నారు. థియేటర్లలో పరిస్థితి చూస్తే.. నిన్న తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అతి తక్కువ ఆక్యుపెన్సీ నమోదైంది. కరోనా భయం తీవ్రంగా ఆవహించిన జనాలు.. అడుగు బయట పెట్టడానికే భయపడుతున్నారు. దీంతో.. హైదరాబాద్ లో ఒకటీ రెండు చోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేసినట్టు సమాచారం. ఆ లెక్కన ఓవరాల్ గా రెండు మూడు కోట్లకు మించి వచ్చే ఛాన్స్ లేదని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
మొత్తంగా 175 కోట్ల దగ్గర జరుగుతున్న చర్చకు మరో రెండు నుంచి మూడు కోట్లు యాడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. తెలంగాణలో నేటి నుంచి థియేటర్లు మూతపడుతున్నాయి. వకీల్ సాబ్ నడిచే థియేటర్లకు మాత్రం ఒక వారం వరకు అవకాశం ఇచ్చారు. కానీ.. జనాలు రావట్లేదని ఆ థియేటర్లను కూడా మూసేందుకు చూస్తున్నారు చాలా మంది. ఇక, దిల్ రాజు థియేటర్లతోపాటు మరికొన్ని మాత్రమే రన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగానే ఉంటుంది.