చిత్ర పరిశ్రమలోకి ఎందరో నటీ నటులు కళతోనో, కలలతోనో అడుగు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందులో కొందరు సినీ ప్రపంచంలో తారా జువ్వలుగా ఎత్తైన శిఖరాలని అధిరోహిస్తే, కొందరేమో విఫలమవుతారు. అనూహ్యంగా కొద్దీ మంది మాత్రం తళుక్కున మెరిసి మాయమవుతారు. వీరిని వన్ హిట్ వండర్ గా ఇండస్ట్రీలో అభివర్ణిస్తారు. టాలీవుడ్లో వన్-హిట్ వండర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది నటీమణులు గుర్తుకు వస్తారు. తెలుగు సినిమా పరిశ్రమలో అలా మిగిలిపోయి, కనుమరుగైపోయిన కొంత మంది తారామణుల గురించిన స్పెషల్ ఆర్టికల్…
1. గిరిజ షట్టర్- గీతాంజలి (1989)
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నెన్నో ప్రేమ కథలు మధురమైన దృశ్య కావ్యాలుగా మలచబడి వాటికంటూ ప్రత్యేకంగా ఒక పేజీని సొంతం చేసుకున్నాయి. అలా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో “గీతాంజలి” ఒకటి. సినీ ప్రపంచంలో మేటి దర్శకుల్లో ఒకరైన మణిరత్నం తీసిన ఈ మూవీ సినీ అభిమానులకి ఒక అద్భుతంగా గుర్తుండిపోయింది.
అక్కినేని నాగార్జున తో కలిసి నటించిన గిరిజ షట్టర్ చిలిపితనంతో కూడిన చిన్న పిల్లలాగా , అమర ప్రేమకురాలిగా ఆనందంలోనూ-విషాదంలోనూ ఆమె నటన ప్రేక్షకులని కట్టిపడేసింది. ఆ తరువాత ఆమె మోహన్ లాల్ సరసన దర్శకుడు ప్రియదర్శన్ తీసిన ‘వందనం’లో నటించింది. అయితే ఎందుకోగానీ సినిమా రంగాన్ని వద్దనుకుని ఫారిన్ చెక్కేసింది.
2. అన్షు- మన్మధుడు (2002)
మన్మధుడు సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన అన్షు తన అందం, నటనతో ఆ మూవీలో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ పాత్రను, మిస్సమ్మ సినిమాలో అతిధి పాత్రలో నటించింది. కొన్ని కన్నడ చిత్రాలలో కూడా నటించింది. సినిమా పరిశ్రమ నుండి తప్పుకుని లండన్ లోని నివసిస్తున్న సచిన్ అనే వ్యక్తిని అన్షు పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయింది.
3. గౌరీ ముంజల్- బన్నీ(2005)
ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన “బన్నీ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. ఈ అమ్మడు తన మొదటి చిత్రంలోనే స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్న అప్పటికీ ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా రాణించలేకపోయింది. శ్రీకృష్ణ 2006, గోపి గోడమీద పిల్లి, భూకైలాస్, కౌసల్యా సుప్రజా రామా, బంగారు బాబు తదితర చిత్రాలలో నటించినా అమ్మడు బన్నీ హీరోయిన్ గానే ప్రేక్షకులకి గుర్తుండిపోయింది.
4. షామిలి- ఓయ్ (2009)
బేబీ షామిలి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ చిన్నతనం నుంచే తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ ఇండస్ట్రీ అభిమానుల్ని తన నటనతో కట్టిపడేసింది.రెండేళ్ల వయస్సులోనే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి సినిమాలో మెంటల్లీ ఛాలెంజ్ క్యారక్టర్’లో పరకాయ ప్రవేశం చేసి మొదటి సినిమాతో నేషనల్ ఫిల్మ్ం అవార్డ్ ను సొంతం చేసుకుంది. 2009లో హీరోయిన్’గా తెలుగులో హీరో సిద్ధార్ద్ సరసన యాక్ట్ చేసింది.ఆ తరువాత మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన షామిలికి 2018లో అమ్మమ్మ గారి ఇల్లు చివరి సినిమా.
5. నేహాశర్మ- చిరుత(2007)
మెగా వారసుడు రామ్‌చరణ్ మొదటి సినిమా ‘చిరుత’లో నటించి తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయమైంది నేహాశర్మ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. కానీ.. ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.. అయినా.. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలతో కొంత కాలం బిజీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అమ్మడు ఖాళీగా ఉంటూ హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
6. భాను శ్రీ మెహ్రా- వరుడు( 2010)
2010లో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ విడుదలయ్యే వరకు హీరోయిన్ ఎవరు, ఎలా ఉంటుందనేది దాచి పెట్టి గుణశేఖర్ చాలా హడావిడే చేశారు. కానీ వరుడు మూవీ చాలా దారుణంగా అపజయం పాలయ్యింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ ఈమె వన్ టైం మూవీ హీరోయిన్ గానే మిగిలిపోయింది.
7. సారా జేన్ డయాస్- పంజా (2011)
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన పంజా చిత్రంలో డెబ్యూ నాయికగా ఛాన్స్ దక్కించుకుంది సారా జేన్ డయాస్. అంత పెద్ద స్టార్ తో ఆఫర్ అంటే ఆ తర్వాత అగ్ర నాయిక అయిపోతుందనే భావించారు. కానీ అమ్మడికి తెలుగులో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. ఆ సినిమా తర్వాత అవకాశాల కోసం బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
8. అనురాధ మెహతా- ఆర్య (2004)
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య మూవిలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైనా ముద్దు గుమ్మ అనురాధ మెహతా . అద్భుతమైన విజయం సాధించినా అమ్మడికి అదిరిపోయే అవకాశాలు మాత్రం అందలేదు. ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ ఆమె పెద్దగా రాణించలేకపోయింది. ఆ తర్వాత వెండితెరకు పూర్తిగా దూరం అయ్యింది.
9. మీరా చోప్రా- బంగారం (2006)
2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీరా చోప్రా ఆ తర్వాత నితిన్ “మారో ” చిత్రంలో నటించినా ఆమెకు గుర్తింపు, అవకాశాలు రాలేదు. పవన్ కళ్యాణ్ హీరోయిన్ గానే ఆమెను ఇప్పటికి పిలుస్తారు.
10. సయేషా సైగల్- అఖిల్ (2015)
సయేషా సైగల్… అక్కినేని అఖిల్ లాంఛింగ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బాలీవుడ్‌కు కూడా వెళ్లింది. అక్కడ అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోతో శివాయ్ సినిమాలో నటించింది. ఆ వెంటనే తమిళ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తమిళ నటుడు ఆర్య ని పెళ్లి చేసుకుని సినిమా పరిశ్రమకి టాటా చెప్పేసింది.