
నటీనటులుః ఫరాన్ అక్తర్, మృణాల్ ఠాకూర్, పరేశ్ రావల్, మోహన్ అగషే, హుస్సేన్ దలాల్, తదితరులు
దర్శకత్వంః రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా
నిర్మాతలుః రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్, రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా
సంగీతంః శంకర్ ఎహసాన్ లాయ్
రిలీజ్ః అమెజాన్ ప్రైమ్
సినిమాను దున్నేయడానికి, హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి అవసరమైన జోనర్లలో స్పోర్ట్స్ ఒకటి. ప్రేక్షకులను గేమ్ లో ఇన్వాల్వ్ చేస్తే.. టైటిల్ గెలిచినట్టే. ఇందులోనూ బాక్సింగ్ ను ఎంచుకుంటే.. ఆ కిక్కే వేరు. ప్రత్యర్థులపై హీరో విసిరే కిక్ లతో.. ఆడియన్స్ కు యమా కిక్కు వచ్చేస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘తుఫాన్’. గతంలో ఎన్నో సినిమాలు బాక్సింగ్ నేపథ్యంలో వచ్చినప్పటికీ.. సరైన కథను అల్లుకుంటే.. ఎప్పటికీ సక్సెస్ లభిస్తుందని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. మరి, ఈ తుఫాన్ సృష్టించిన విధ్వంసం ఎంత అన్నది చూద్దాం.
కథః హీరో ఫరాన్ అక్తర్ ముంబైలో స్ట్రీట్ ఫైటర్, మొండిగా వ్యవహరించే ఫరాన్.. అనుకున్నది వెంటనే జరిగిపోవాలని ఆశిస్తాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పరిచయం అవుతుంది. ఆమెతో కలిసి మెరుగైన బాక్సింగ్ నేర్చుకునేందుకు కోచ్ పరేశ్ రావల్ వద్ద చేరుతాడు. ఆయన హీరోయిన్ తండ్రే. మొత్తానికి పరేశ్ రావల్ కోచింగ్ లో తోపు బాక్సర్ గా మారిపోతాడు. స్టేట్ ఛాంపియన్ గా మారిపోతాడు. అయితే.. హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం తండ్రి పరేశ్ రావల్ కు తెలిసిపోతుంది. హీరోను తిట్టి వెళ్లగొడతాడు. అయితే.. ఈ క్రమంలో నేషనల్ మీట్ కు వెళ్లిన ఫరాన్ అక్తర్.. అక్కడ డబ్బులు తీసుకొని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఓడిపోతాడు. నిజం తేలడంతో బాక్సింగ్ ఫెడరేషన్ సస్పెండ్ చేస్తుంది. మరి, హీరో ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? మళ్లీ రింగులోకి ఎలా వచ్చాడు? ప్రేమ ఏమైంది? అన్నది మిగతా కథ.
విశ్లేషణః బాక్సింగ్ నేపథ్యం ఎప్పుడూ పవర్ ఫుల్ గా ఉంటుంది. అన్ని భాషల్లోనూ దీనికి క్రేజ్ ఉంది. తెలుగులో పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’, రవితేజ ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. హిందోలనూ ముక్కాబాజ్, సుల్తాన్, బ్రదర్స్ వంటి చిత్రాలు కూడా దుమ్ములేపాయి. అయితే.. అన్ని సినిమాల్లో బాక్సింగ్ కామన్ అయినప్పటికీ.. దాని చుట్టూ అల్లుకున్న కథ ఖచ్చితంగా కొత్తదై ఉండాలి. లేదంటే.. రొటీన్ ఫీలింగ్ వచ్చేస్తుంది. పై సినిమాలు చూసిన వారికి తుఫాన్ కూడా పాత కథే అన్నట్టుగా అనిపిస్తుంది. హీరో మొదటి సారి బాక్సింగ్ నేర్చుకోవడం.. మళ్లీ రెండోసారి వచ్చేందుకు చేసే ప్రయత్నాలు, లవ్, మ్యారేజ్ వంటి ఎపిసోడ్లు అలా సాగిపోతాయి. కొన్ని సీన్లు అర్థంకాకుండానే వెళ్లిపోతాయి. ఇక, దేశంలో ఉన్న రెండు వర్గాల పంచాయితీని కూడా చూపించాడు. కానీ.. ఈ విషయంలో దర్శకుడు ఏం చెప్పాడన్నది మాత్రం లేదు. కంక్లూజన్ ఇవ్వకుండా.. ప్రేక్షకులకే వదిలేశాడు. ఇలాంటి డ్రా బ్యాక్స్ ఉన్నాయి.
పెర్ఫార్మెన్స్ః ఈ సినిమాకు ఆయువు పట్టు హీరో, హీరోయిన్, కోచ్. మొదటగా సాధారణంగానే ఉన్న ఫరాన్ అక్తర్ పెర్ఫార్మెన్స్. రెండో సారి బరిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇచ్చిన పెర్ఫార్మన్స్ కేక పెట్టిస్తుంది. ఎమోషన్ సన్నివేశాల్లో తానే ఎంత అద్భుతమైన నటుడు అన్నది చాటి చెప్పాడు. ఇక, బాక్సర్ గా కనిపించేందుకు కండలు తిరిగిన దేహాన్ని పొందేందుకు ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. అటు హీరోయిన్ క్యూట్ గా కనిపించడంతోపాటు.. అవసరమైన చోట బాధ్యత తీసుకునే వ్యక్తిగా చక్కగా నటించింది. హీరోకు అండగా నిలిచింది. ఇక, పరేష్ రావల్ తన సీనియారిటీతో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు.. పైన ఉదహరించిన చిత్రాలను చూసిన వారికి కొత్తదనం ఏమీ అనిపించదు. అవి చూడని వారికి మాత్రం మంచి ఫీల్ వస్తుంది.
బలాలుః ఫరాన్ అక్తర్, పరేష్ రావల్
బలహీనతలుః పాత కథ, నిడివి ఎక్కువ, కథనంలో లోపం
లాస్ట్ లైన్ః ‘పంచ్’ సరిగా పడలేదు
రేటింగ్ః 2/5