Pawan Kalyan- Rajamouli: రాజమౌళితో మూవీ చేయాలని ప్రతి హీరోకి ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయాలని చాలా మంది దర్శకులు కోరుకుంటారు. హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే రాజమౌళి భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ తో మూవీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఆ కాంబినేషన్ పడితే ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం. మరి వీరిద్దరి కలయికలో సినిమా ఎందుకు రాలేదనే సందేహం అందరిలో ఉంది. దీనికి దర్శకుడు రాజమౌళి స్వయంగా సమాధానం చెప్పారు. గతంలో రాజమౌళి ఒక కాలేజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లారు. వేదికపై మాట్లాడుతున్న రాజమౌళిని… పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తారని అభిమానులు అడిగారు.

దానికి రాజమౌళి ఆసక్తికర సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఏళ్ల తరబడి ఎదురు చూసినట్లు వెల్లడించారు. ఓ సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. సార్ మనం సినిమా చేద్దాం, మీకు ఎలాంటి కథ కావాలో చెప్పండి అన్నాను. నాకు ఇలాంటి కథ కావాలని చెప్పను. మీరే మంచి కథ సిద్ధం చేయండి సినిమా చేద్దాం అన్నారు. ఓకే సార్… మీరు ఎప్పుడు పిలిచినా నేను వచ్చి కథ చెప్పడానికి సిద్ధం. మీరు నాకు కబురు పెట్టండని చెప్పాను.
అయితే పవన్ కళ్యాణ్ గారి నుండి నాకు పిలుపు రాలేదు. ఆయన పిలిస్తే కథ చెబుదామని నేను ఏడాదిన్నర కాలం ఎదురు చూశాను. తర్వాత నా థింకింగ్ మారిపోయింది. మాస్ సినిమాలు కాకుండా మగధీర, యమదొంగ లాంటి జోనర్స్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత లార్జర్ దేన్ లైఫ్, ఎక్కువ రోజులు సమయం తీసుకునే చిత్రాలు వైపు వెళ్ళాను. మరోవైపు పవన్ గారు సినిమాల కంటే రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ విధంగా మా దారులు వేరయ్యాయి. అందుకే పవన్ తో సినిమా సాకారం కాలేదు, అని రాజమౌళి వివరణ ఇచ్చారు.

రాజమౌళి మాటల ప్రకారం 2009లో విడుదలైన మగధీర చిత్రం కంటే ముందే పవన్ తో ఆయన సినిమా చేయాలనుకున్నారు. ఆ సమయంలో పవన్ వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. టైం కుదరలేదు, కాంబినేషన్ సెట్ కాలేదు. కాగా రాజమౌళి కెరీర్ లో 12 చిత్రాలు చేశారు. వాటిలో అత్యధికంగా నాలుగు ఎన్టీఆర్ తో, మూడు ప్రభాస్ తో చేశారు. రామ్ చరణ్ తో రెండు చిత్రాలు చేశారు.