Gaalodu Movie: జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదిగి తన ట్యాలెంట్ తో బుల్లితెర స్టార్ గా ఎదిగాడు సుడిగాలి సుధీర్. ఇక టీవీ షోలు, డ్యాన్స్ రియాలిటీ షోలతో బుల్లితెరపై మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు మ్యాజిక్ షోలు, అదిరిపోయే స్టంట్లు చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. పలు కార్యక్రమాల్లో తన సింగింగ్ ట్యాలెంట్‌ను ప్రదర్శించిన అతను వెండితెరపై కూడా రాణించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘3 మంకీస్’ చిత్రాల్లో హీరోగా నటించాడు. అయితే ఆ సినిమాలు ఆశించిన మేర ఫలితం సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో కథానాయకుడిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం సిద్ధమయ్యారు సుధీర్.

రాజశేఖర్ దర్శకత్వంలో గాలోడు అనే సినిమాలో సుధీర్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా పలు సినిమాల్లో నటించిన సుధీర్ ఈ చిత్రంలో తొలిసారిగా మాస్ లుక్‌లో కనిపించాడు. యాక్షన్ సీన్లలోనూ అద్భుతంగా నటించాడు సుధీర్. ముఖ్యంగా ఈ టీజర్ లో డైలాగ్ లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న ఈ టీజర్‌లో సుధీర్ లుక్స్, హీరోయిజం బాగా ఎలివేట్ చేసి చూపించారు.
కాగా ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పీ హీరోయిన్‌గా నటించగా… సప్తగిరి, పృథ్వీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమాలోనూ సుధీర్ హీరోగా నటిస్తున్నాడు.
