RRR: ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల వ్యవహారం ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాల పై బాగా ప్రభావం చూపిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఏమి చేయలేక తమ సినిమాకు సంబంధించి మార్కెట్ రేట్లను ఇష్టం లేకపోయినా కుదించుకుంటున్నారు. అందుకు ఉదాహరణ ‘ఆర్ఆర్ఆర్’నే తీసుకుందాం. ఆంధ్రాలో ఈ చిత్రానికి భారీ మార్కెట్ జరిగింది. కానీ కరోనా పరిస్థితులు ఒకపక్క, తగ్గిన సినిమా టికెట్ రేట్లు మరోపక్క.. మొత్తానికి ఆర్ఆర్ఆర్ మార్కెట్ విలువను 30శాతానికి కుదించారని తెలుస్తోంది.

నిజానికి ఆంధ్రా, సీడెడ్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఊహించని దాని కంటే ఎక్కువ జరిగింది. బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా కోసం ఎగబడ్డారు. ఎంతైనా ఇవ్వడానికి మేము రెడీ అంటూ ముందుకు వచ్చారు. దాంతో ఈస్ట్ ఏరియా రైట్స్ ను 18 కోట్లకు అమ్మారు. అయితే, ఇప్పుడు 5 కోట్లు తగ్గించి 13 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్నారు. అలాగే ఉత్తరాంధ్ర ఏరియా థియేట్రికల్ రైట్స్ ను 26 కోట్ల నుంచి 7 కోట్లు తగ్గించి 19 కోట్లకు డీల్ ను ఖాయం చేశారు.
మొత్తానికి ఆర్ఆర్ఆర్ కు ఆంధ్ర, సీడెడ్ కలుపుకుని మొదట అనగా కరోనాకి ముందు, అలాగే టికెట్ రేట్లు కుదింపుకు ముందు 98 కోట్ల రూపాయల వరకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసి. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా 68 కోట్ల రూపాయలకు తగ్గించారు. అయితే నైజాం బిజినెస్ లో ఎలాంటి మార్పులు ఉండవని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్క ఆంధ్రలోనే ౩౦ కోట్లు వరకు డబ్బులు తగ్గడం మేకర్స్ కు బాధాకరమైన విషయమే.
ఈ సమస్య ఆర్ఆర్ఆర్ కే కాదు, పుష్ప, అఖండ, ఆచార్య, రాధే శ్యామ్, ఇలా దాదాపు అన్నీ పెద్ద సినిమాలకు ఉంది. కాకపోతే ఆర్ఆర్ఆర్ పెద్ద సినిమా కాబట్టి.. ఎక్కువ మొత్తాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతోంది. అన్నీ రాష్ట్రాల్లో జనం ముందు థియేటర్స్ కి రావడానికి అలవాటు పడాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న ఈ మల్టీస్టారర్ కి ఓపెనింగ్స్ కీలకం.
కాగా రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురంభీమ్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. పైగా ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుండటం, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండటం, అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటంతో.. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.