Pushpa Movie: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. నిన్ననే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాగా దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్లడంతో ఈవెంట్ కు హాజరు కాలేకపోయారు. కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. అలానే సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా సమంత నటించిన ఐటెం నెంబర్ ‘ఊ అంటావా మావా ఊహూ అంటావా’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
డిఫరెంట్ ట్యూన్ తో సాగిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత మాస్ అవతారం పాటకి హైలైట్ గా నిలిచింది. రీసెంట్ గా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను వదలగా.. అది ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. బన్నీ ఒళ్లో కూర్చొని సమంత వేసే స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ పాటపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ పురుష సంఘం సంస్థ కేసు వేసినట్లు సమాచారం అందుతోంది. పాటలో లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని… మగాళ్లను తక్కువ చేస్తూ రాశారని సదరు సంఘం పిటిషన్ లో పేర్కొంది. వెంటనే ఆ పాటను తీసేయాలి అంటూ వారు డిమాండ్ చేశారు. ఈ సాంగ్ తీసిన చిత్ర బృందంపై, సాంగ్ లో నటించినందుకు సమంతపై కేసు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. వెంటనే దీనిపై చిత్ర బృందం క్షమాపణలు చెప్పాలని కూడా పిటిషన్లో పేర్కొంది ఆ సంస్థ. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.