
Chandrababu- YCP: చంద్రబాబు బుర్రకు పదును పెడుతున్నారా? తనలో ఉన్న పాత నాయకుడ్ని బయటకు తీస్తున్నారా? వైసీపీకి చావు దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారా? వైసీపీపై గేమ్ స్టార్ట్ చేశారా? అందులో భాగమే 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చూస్తున్నారన్న ప్రచారమా? దీనికి ఎల్లో మీడియా సాయం తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ఎగురేసుకుపోయారు. ఇంకా 40 మంది వరకూ ఉన్నారని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇది వ్యూహాత్మకమా? లేకుంటే నిజంగానే ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారా? అన్నది మాత్రం సస్పెన్షన్ గా ఉంది. 40 మంది వరకూ కాకపోయినా.. ఆ సంఖ్య 20లోపు మాత్రం ఉంటుందన్న కొత్త చర్చ ప్రారంభమైంది. ఇది వైసీపీలో అనుమానాలు, అపార్ధాలకు తావిస్తోంది. హైకమాండ్ అనుమానాపు చూపులు చూస్తుండడంతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అభద్రతా భావంతో ఉన్నారు.
చంద్రబాబు రివేంజ్ ప్లాన్…
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో చంద్రబాబుకు జగన్ ఉక్కిరిబిక్కిరి చేశారు. 23 మంది ఉన్న ఎమ్మెల్యేల్లో నలుగుర్ని తన వైపు లాక్కుని 19 వద్ద ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంచారు. మరొకరు తగ్గితే టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. అయితే అది జగన్ సాధించుకోవచ్చు. కానీ చంద్రబాబు భయం నీడలో ఉండాలని విడిచిపెట్టినట్టున్నారు. అయితే అప్పటి నుంచి చంద్రబాబును ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాలో పెట్టారు. కానీ వాటన్నింటికీ తట్టుకొని చంద్రబాబు నిలబడగలిగారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అనూహ్య విజయం దక్కడంతో తనలో ఉన్న పాత నాయకుడ్ని, వ్యూహాలను చంద్రబాబు బయటకు తీశారు. సరిగ్గా ఎన్నికల ముంగిట తనకు ఎదురైన పరాభావానికి గట్టి సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అతి చేస్తే టీడీపీకే నష్టం…
ఇప్పుడు టీడీపీలో ఒక స్లోగన్ వినిపిస్తోంది. వైనాట్ పులివెందుల. గతంలో వైసీపీ వైనాట్ కుప్పం అన్న సీఎం డైలాగుకు కౌంటర్ గా టీడీపీ అటాక్ చేస్తోంది. అంతటితో ఆగకుండా 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నాయకత్వానికి టచ్ లో ఉన్నారని ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది. అయితే ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నా.. అల్టిమేట్ గా టీడీపీకి కూడా నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేలు వస్తే తమ పరిస్థితి ఏమిటన్న బెంగ టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిలకు వెంటాడుతోంది. అందుకే ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిసారించకపోవడంతో మైనస్ గా మారే అవకాశముంది. గత నాలుగేళ్లుగా నియోజకవర్గ స్థాయిలో ఎవరితో ఫైట్ చేశామో.. వారే ఇటువస్తే తమ పరిస్థితి ఏమిటని శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే..
ఎన్నికల సమయానికి కొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశం వుంది. ఎందుకంటే సర్వే నివేదికలు కొందరు ఎమ్మెల్యేలకు ప్రజావ్యతిరేకత ఉండడమే. ఏ రాజకీయవేత్త అయినా తన ఉనికి కోసం పార్టీలను ఆశ్రయించక తప్పదు. ఈ నేపథ్యంలో వైసీపీ కాకపోతే, ప్రత్యామ్నాయం టీడీపీనే కనిపిస్తోంది. మరోవైపు రెండో ప్రాధాన్యం కింద జనసేనను ఎంచుకునే అవకాశం వుంది. దేశ స్థాయిలో బీజేపీ పేద్ద తోపు పార్టీ అయినప్పటికీ, ఏపీలో మాత్రం దాని బలం శూన్యం. ఇటువంటి సమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా పనిచేయాలి తప్ప… అతి చేస్తే అంతిమంగా నష్టం జరిగేది ఆ పార్టీకే. చేరికల విషయంలో అస్పష్ట ప్రకటనలతో చేటు తప్ప..ప్రయోజనం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.