Allu Arjun: ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో అల్లు అర్జున్. ఆయన తీసిన పుష్ప సినిమా క్రేజ్ భారత్‌తోపాటు విదేశాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇక హీరో అల్లు అర్జున్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం పుష్ప– 2 సినిమా షూటింగ్‌లో ఈ ఐకాన్ స్టార్ బిజీగా ఉన్నాడు. అయితే ఆయనకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు బొమ్మ ఏర్పాటు చేశాడు. దానిని ఐకాన్ స్టార్ స్వయంగా మార్చి 28న ఆవిష్కరించాడు.
తొలి సౌత్ ఇండియా స్టార్‌గా..
దుబయ్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ ఏర్పాటు చేసే అవకాశం సౌత్ ఇండియా నుంచి ఒక్క అల్లు అర్జున్‌కు మాత్రమే దక్కింది. ఈ గౌరవం దక్కిన తొలి సౌత్ ఇండియా హీరోగా నిలిచాడు ఐకాన్ స్టార్. ఇక ఘనంగా జరిగిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బన్నీ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. ఈ గౌరవం దక్కించుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మురిసిన తమ్ముడు..
ఇదిలా ఉండగా టుస్సాడ్స్ మ్యూజియంలో అన్న అల్లు అర్జున్ మైనపు బొమ్మ చూసి ఆయన సోదరుడు అల్లు శిరీష్ మురిసిపోయాడు. బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ దుబాయ్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 15 ఏళ్ల క్రితం ఇద్దరం కలిసి దుబయ్ మ్యూజియం చూడడానికి టూరిస్టులుగా వచ్చామని తెలిపాడు. ఆ సమయంలో మ్యూజియంలో ఉన్న విగ్రహాలతో ఫొటోలు దిగినట్లు పేర్కొన్నాడు. ఇంత గొప్ప ప్లేస్‌లో తమ కుటుంబం నుంచి ఒకరి మైనపు బొమ్మ ఇక్కడ ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదని వెల్లడించాడు. ఆ విగ్రహంతో తాను ఫొటో దిగుతానని అనుకోలేదని తెలిపాడు. బన్నీ సినీ ప్రయాణం చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నాడు. బన్నీతో, బన్నీ మైనపు బొమ్మతో దిగిన ఫొటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
సతీమణి కూడా..
ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహ కూడా బన్నీకి శుభాకాంక్షలు తెలిపింది. భార్యగా తనకు గర్వంగా ఉందని తెలిపింది. ఎక్కడైనా తనకంటూ ప్రత్యేకత చాటుకునే అర్జున్ ఇప్పుడు మైనపు విగ్రహంతో శాశ్వతంగా అందరినీ ఆకర్షిస్తుంటాడని తెలిపింది. మార్చి 28, 2024 ఎప్పటికీ గుర్తుండిపోతుందని స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.