Director PC Reddy: తెలుగు త్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది నుంచి పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని వీడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో… తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్ర శేఖర్ రెడ్డి మరణించారు. ఈ రోజు ఉదయం 8.30లకు చెన్నైలో పీసీ రెడ్డి మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు కాగా… సుమారు 80 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు తదితర స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు సాధించారు. ఎన్టీఆర్‌తో ‘బడిపంతులు’, సూపర్ స్టార్ కృష్ణతో ‘పాడి పంటలు’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఘనత పీసీ రెడ్డి సొంతం.
1933, అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు పీసీరెడ్డి. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేశారు. వి.మధుసూధనరావు, ఆదుర్తి సుబ్బారావు వంటి దర్శక దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆతర్వాత ‘అనురాధ’ అనే సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించారు. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
దీంతో కృష్ణ- పీసీ రెడ్డిల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆతర్వాత వీరి కాంబినేషన్‌లో పదుల సంఖ్యలో హిట్ సినిమాలు వచ్చాయి. వీటితో పాటు ‘భలే అల్లుడు’, ‘మానవుడు దానవుడు’, ‘విచిత్ర దాంపత్యం’ ‘రగిలే గుండెలు’, ‘నవోదయం’, ‘బంగారు కాపురం’, ‘రాజకీయ చదరంగం’, ‘అన్నా వదిన’, ‘పట్నవాసం’, ‘అన్నా చెల్లులు’, ‘పెద్దలు మారాలి’ తదితర హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.