Tollywood Producers: డబ్బులు పెట్టేశాం… దర్శకుడు అన్నీ చూసుకుంటాడులే. అందులోనూ మన సినిమాలో స్టార్ హీరో నటిస్తున్నాడు, అని నిర్మాత నిద్రపోతే సరిపోదని హరి హర వీరమల్లు రిజల్ట్ గుర్తు చేస్తుంది. మేకింగ్ తో పాటు సాంకేతికంగా సినిమా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉందా? అనే విషయంలో పర్యవేక్షణ లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు..
Also Read: ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది..ఒకపక్క యాక్షన్..మరోపక్క ఎమోషన్!
హరి హర వీరమల్లు(HARI HARA VEERAMALLU) టాలీవుడ్ ఎపిక్ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. పవన్ కళ్యాణ్ వంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో సినిమా రెండో రోజే కూలబడింది అంటే నమ్మగలమా?. హరి హర వీరమల్లు 2వ రోజు కేవలం రూ. 9 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. షేర్ రూ.4-5 కోట్ల మధ్య నమోదు అయ్యింది. నిజానికి ఇది ఒక ఏరియాలో రావాల్సిన మొత్తం. హరి హర వీరమల్లు పరాజయానికి ప్రధానంగా వినిపించిన కారణాల్లో పూర్ విఎఫ్ఎక్స్. ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ గతంలో ఎన్నడూ చూడలేదని ఆడియన్స్ కామెంట్స్ చేశారు.
ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ గతంలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు జనాలు ఏకిపారేశారు. హరి హర వీరమల్లు విడుదల తర్వాత ఆదిపురుష్ విజువల్స్ చాలా బెటర్ అనే వాదన తెరపైకి వచ్చింది. రూ. 200 కోట్లకు పైగా వెచ్చించి తెరకెక్కించిన స్టార్ హీరో చిత్రంలో ఇలాంటి గ్రాఫిక్స్ ఊహించలేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రోలింగ్ మెటీరియల్ గా మారిన విఎఫ్ఎక్స్ సీన్స్ హరి హర వీరమల్లు నుండి తొలగించారు అంటే… అవి ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఎలాంటి సాంకేతిక లేని రోజుల్లో కేవీరెడ్డి మాయాబజార్ చిత్రంలో కెమెరా ట్రిక్స్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి దశాబ్దాలు అవుతుంది. 1993లో వచ్చిన జురాసిక్ పార్క్ మూవీలో డైనోసార్స్ ని చాలా సహజంగా చూపించాడు స్టీవెన్ స్పీల్ బర్గ్. ఆ సినిమా వచ్చి మూడు దశాబ్దాలు దాటిపోయింది. అంతటి సాంకేతికత, టెక్నీక్ ఇప్పటికీ ఇండియన్ సినిమా అందుకోలేదు అంటే అతిశయోక్తి కాదు.
హాలీవుడ్ సినిమా అవతార్ స్థాయికి చేరింది. ఓకే… హాలీవుడ్ మార్కెట్, బడ్జెట్ వేరు అని సమర్ధించుకున్నా… ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత వేరు. అలాగే స్టార్ హీరోల సినిమాలు రూ.200-500 బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అయినప్పటికీ సదరు చిత్రాల్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. లోపం ఎక్కడ ఉందంటే… దర్శకుడిలో మేటర్ లేకపోతే బడ్జెట్ ఎంత ఇచ్చినా, క్వాలిటీ విఎఫ్ఎక్స్ రాదని పలు సందర్భాల్లో తేలింది.
ఈ విషయంలో దర్శకుడు శంకర్ దిట్ట. రోబో సినిమాలో ఆయన క్వాలిటీ విజువల్స్ ఇచ్చారు. చాలా వరకు రోబో మూమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సహజంగా ఉంటాయి. కారణం విఎఫ్ఎక్స్ సాంకేతికత మీద ఆయనకు అవగాహన ఉంది. దాన్ని ఆయన అధ్యయనం చేశారు. ప్రశాంత్ వర్మ రూ. 50-60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన హనుమాన్ మూవీలో మెప్పించే విజువల్స్ ఇచ్చారు. ఓం రౌత్ రూ. 600 కోట్లు వెచ్చించి కార్టూన్ తరహా విజువల్స్ అందించారు.
దర్శకుడి అవగాహన లేమికి నిర్మాత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. హరి హర వీరమల్లు, ఆదిపురుష్ చిత్రాల ఫలితాలతో నిర్మాతలు ఓ విషయం గ్రహించాలి. స్టార్ హీరో ఉన్నాడు, డబ్బులు పెట్టేసి రిలాక్స్ అవుదాం అనుకుంటే కోట్లలో నష్టాలు తప్పవు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉందా లేదా? మనం పెట్టిన రూపాయికి న్యాయం జరుగుతుందా లేదా? అనే విషయాలు నిర్మాతలు గమనించాలి.